కమిషనర్ అయిన ఎస్సై.. ఐపీఎస్‌గా కూడా ప్రమోషన్

by  |
police-Commissioner1
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ బదిలీ అయ్యారు. విధుల్లో చేరి ఆరు సంవత్సరాల తర్వాత బదిలీ చేస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం 30 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేయగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ను హైదరాబాద్ జాయింట్ కమిషనర్ గా నియమించింది. 2016 అక్టోబర్ 11న కొత్తగా ఏర్పడిన నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కు తొలి కమిషనర్ గా కార్తికేయను నియమించారు. 2 సంవత్సరాల క్రితం కార్తికేయకు డీఐజీగా పదోన్నతి లభించినా పోస్టింగ్ ఇవ్వలేదు. జిల్లాలో ఐదు సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసిన ఎస్పీ గానీ.. కమిషనర్ గానీ ఎవరూ లేరు. దాదాపు ఆరు సంవత్సరాల పాటు కొనసాగిన కార్తికేయను హైదరాబాద్ కి బదిలీ చేస్తూ ఆయన స్థానంలో సీఐడీ విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్న కె. ఆర్. నాగరాజును నియమించారు. నిజామాబాద్ తొలి కమిషనర్ గా పని చేసిన కార్తికేయ సౌమ్యులుగా.. కలుపుగోలుగా ఉన్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నులలో పని చేశారు అనే అపవాదు మూటగట్టుకున్నారు. సిరికొండ మండలం న్యావనందికి చెందిన పుర్రె మమత హత్య కేసు ఏడాది గడిచినా కొలిక్కి రాలేదు. సిట్ ఏర్పాటు చేసినా దర్యాప్తు పూర్తి కాకపోవడంతో సీఐడీకి కేసు బదిలీ చేసినా ఇంకా కేసు కొలిక్కిరాలేదు. ఈ హత్య రాజకీయ దుమారం లేపింది. కమ్మర్ పల్లి హాస కొత్తూరు లో బీజేపీ కార్యకర్త హత్య కేసులో పోలీసులపై ప్రజలు తిరుగబడ్డారు. యువకులు కత్తులతో పొడుచుకున్న డబల్ మర్డర్ జిల్లా కేంద్రంలో రైల్వే గ్రౌండ్ లో జరిగింది. డిచ్ పల్లి జాతీయ రహదారి సమీపంలో త్రిబుల్ మర్డర్ ఈ నెలలోనే జరిగింది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టినంక నేరస్థులపై పీడీ యాక్టుల నమోదు ప్రారంభం అయింది.

నిజామాబాద్ రెండవ కమిషనర్ గా నియమితులైన కె.ఆర్. నాగరాజు 1989 లో ఎస్ఐగా చేరి అంచెలంచెలుగా ఎదిగారు. వరంగల్ లో ఎస్ఐగా, సీఐగా పని చేశారు. వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీగా పనిచేశారు. నాన్ క్యాడర్ ఎస్పీగా ఉన్న నాగరాజుకు ఇటీవలనే ఐపీఎస్ గా ప్రమోషన్ వచ్చింది. ఐపీఎస్ గా పదోన్నతి పొందిన తర్వాత నిజామాబాద్ రెండవ కమిషనర్ గా నియమితులవడం విశేషం.

కామారెడ్డి ఎస్పీగా డీ. శ్రీనివాస్ రెడ్డి

కామారెడ్డి ఎస్పీగా పనిచేస్తున్న శ్వేతా రెడ్డి సిద్దిపేట పోలీస్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పడిన కామారెడ్డి జిల్లా ఎస్పీగా శ్వేతా రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. దాదాపు ఐదు సంవత్సరాల మూడు నెలలు ఎస్పీగా పని చేశారు. శ్వేత స్థానంలో జనగాం డీసీపీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డిని కామారెడ్డి జిల్లా ఎస్పీగా నియమించారు.



Next Story