సారొచ్చినా.. ‘సాగర్’ అభ్యర్థి తేలలేదు

by  |
సారొచ్చినా.. ‘సాగర్’ అభ్యర్థి తేలలేదు
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: అధికార టీఆర్ఎస్ పార్టీలో సాగర్ ఉప ఎన్నిక సస్పెన్షన్ ఇంకా వీడలేదు. సాక్షాత్తూ సీఎం కేసీఆర్ హాజరైన బహిరంగ సభలో అభ్యర్థి పేరును ప్రకటించకపోవడంతో ఇంతకీ ఎవరనే దానిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జోరుగా సాగుతోంది. ఓ వైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో పాటు బీజేపీ సైతం ప్రచారంలో దూసుకెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత జానారెడ్డి అభ్యర్థిత్వం ఖరారు కాగా, ఆయన కుమారుడు రఘువీర్‌రెడ్డిని రంగంలోకి దింపుతారన్న ప్రచారం లేకపోలేదు.

ఇక బీజేపీ విషయానికొస్తే.. అభ్యర్థి ఎవరనేది తేలకున్నా.. బీసీ నేతగా గుర్తింపు ఉన్న కడారి అంజయ్య యాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి ఎవరికి వారు ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది ఇంతవరకు తేలలేదు.

సభ జరుగుతున్నంత సేపు ఉత్కంఠ..

సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ఉపఎన్నిక అభ్యర్థిని ప్రకటిస్తారనే ప్రచారం ముందు నుంచి జరిగింది. సభ జరుగుతున్నంత సేపు ఏ క్షణంలో ఎవరి పేరు ప్రకటిస్తారోనన్న ఉత్కంఠ సొంత పార్టీ శ్రేణులతో పాటు ప్రతిపక్షాల్లోనూ నెలకొంది. సాక్షాత్తూ సీఎం కేసీఆర్ ఉపఎన్నిక జరిగే నియోజకవర్గానికి వచ్చినా అభ్యర్థి పేరును ప్రకటించకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. నియోజకవర్గ టీఆర్ఎస్‌లో గ్రూపుల లొల్లి ఏడాదిన్నర కాలంగానే సాగుతోంది.

వాస్తవానికి టికెట్ కోసం ఎంసీ కోటిరెడ్డి, నోముల భగత్‌తో మరో ఇద్దరు ముగ్గురు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థిని ప్రకటిస్తే గ్రూపులుగా పార్టీ చీలిపోతుందనే భయంతోనే వెనుకడుగు వేశారన్న ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా టీఆర్ఎస్ నుంచి ఎవరైనినైనా లాగాలనే ప్రయత్నాలను బీజేపీ ముమ్మరం చేస్తోంది. ఆ ప్రయత్నాలను తిప్పికొట్టడంలో భాగంగానే చివరి వరకు అభ్యర్థిని ఖరారు చేయకుండా ఉండాలనే వ్యూహాన్ని టీఆర్ఎస్ అమలు చేస్తోంది.



Next Story

Most Viewed