హుజురాబాద్‌లో ‘సాగర్ స్టంట్’.. బెంబేలెత్తుతోన్న ప్రజలు

by  |
cm-kcr,-Nagarjuna-Sagar,-hu
X

– యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామం. ఈ గ్రామపంచాయతీ పరిధిలో దాదాపు 80 వరకు పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఆ గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వచ్చంద లాక్‌డౌన్ విధించుకుంది. అది పూర్తయ్యేందుకు ఇంకా నాలుగైదు రోజుల సమయం ఉంది. ఈలోపే రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం.

– బీబీనగర్ మండలం మగ్దుంపల్లి గ్రామంలో శనివారం ఒక్క రోజే 35 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు వీరంతా యువకులే. ఇంకా గ్రామంలో పాజిటివ్ కేసులు మరో రెండు మూడు రోజుల్లో బయటపడే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తేసింది.

దిశ ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో కరోనా మహమ్మారి సృష్టించిన అలజడి అంతాఇంతా కాదు. ఆ మహమ్మారి మరకలు నేటికీ నాగార్జునసాగర్ ప్రజలను వీడడం లేదు. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం నిర్వహించిన సాగర్ ఉపఎన్నిక ఫలితంగా వేలాది మంది కరోనా బారినపడ్డారు. పదుల సంఖ్యలో కరోనా కారణంగా ప్రాణాలొదిలారు. సాగర్ ఉపఎన్నిక ప్రక్రియ ముగిసి దాదాపు రెండు నెలలు కావొస్తున్నా.. దాని ప్రభావం మాత్రం ఇంకా పోనేలేదు. కానీ ప్రభుత్వం మాత్రం మరో ఉపఎన్నిక కోసం సిద్ధం అవుతుందా.. అంటే అవుననే సంకేతాలు విన్పిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఊహించిన పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్ రాజీనామా చేయడం.. వెంటనే శాసనసభ ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. దీనికి ప్రభుత్వం రెట్టింపు వేగంతో ఉపఎన్నిక నిర్వహణను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే హుజూరాబాద్ ఉపఎన్నిక నిర్వహణ కోసం సంపూర్ణ లాక్‌డౌన్ ఎత్తేస్తున్నట్టు రాష్ట్ర కేబినేట్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

రాష్ట్రమంతా అక్కడే..

దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహ్మాయ్య మరణంతో నాగార్జునసాగర్ ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. సాగర్ ఉపఎన్నికలో విజయం సాధించేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలతో పాటు ప్రాంతీయ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం చేశారు. అయితే మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా.. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీలు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వారి కేడర్, నేతలంతా సాగర్ నియోజకవర్గంలో దింపింది. మూడు పార్టీలు ఎవ్వరికీ ఎవ్వరూ తగ్గకుండా నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు తదితరులతో ప్రచార పర్వాన్ని రక్తి కట్టించారు. ఓవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా.. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల నేతలు భారీ సమావేశాలు, సభలు పెట్టి పెద్దఎత్తున ప్రచారం చేశారు. దీంతో కరోనా వైరస్ సాగర్ నియోజకవర్గంలో విలయతాండవం చేసింది.

లాక్‌డౌన్ ఎత్తివేత వెనుక మర్మమేంటి..?

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారమే నిత్యం వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇంకా కొన్ని గ్రామాలు స్వచ్ఛంద లాక్‌డౌన్ నుంచి బయటపడనేలేదు. అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజంగా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడితే.. నిత్యం గ్రామాల్లో వందల సంఖ్యలో కేసులు ఎలా బయటపడుతున్నాయనేది అర్థం కావడం లేదు. కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసుకోవడం కోసమో.. హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమో లాక్‌డౌన్ ఎత్తేశారా..? అన్న సందేహాలూ వెల్లువెత్తుతున్నాయి. నిజంగా ఎమ్మెల్సీ, హుజూరాబాద్ ఉపఎన్నికలను నిర్వహిస్తే.. కరోనా ఉపద్రవాన్ని ఊహించలేమనేది వాస్తవం. అసలే రానున్న రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడమనేది అంత శ్రేయస్కరం కాదనే చెప్పాలి.

సాగర్‌లో నేటికీ ఆగని కరోనా కేసులు..

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసులు నేటికీ తగ్గుముఖం పట్టడం లేదు. ఇప్పటివరకు నియోజకవర్గంలో వేలల్లో పాజిటివ్ కేసులు నమోదు కాగా, పదుల సంఖ్యలో మృతిచెందారు. చివరకు ఉపఎన్నిక పోరులో క్రీయాశీలకంగా వ్యవహరించిన పలువురు పార్టీ కార్యకర్తలు కరోనా బారిన పడి ప్రాణాలొదిలారు. వారి కుటుంబాలను గానీ వారివైపు గానీ కన్నెత్తి చూసిన నేతలు లేరంటే అతిశయోక్తికాదు. ఈ క్రమంలోనే కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు.. ‘మేం ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డాం. ఇప్పుడు కరోనా బారిన పడ్డాం. మమల్ని ఆదుకోండి సారూ..’ అంటూ సోషల్ మీడియా వేదికగా తమ గోడును వెళ్లబోసుకున్న కార్యకర్తలు పదుల సంఖ్యలోనే ఉన్నారు. ఈ ఉపఎన్నిక తాలూకూ కరోనా మరకలు నేటికీ అంటుతూనే ఉన్నాయి. సాగర్ ఉపఎన్నిక సందర్భంగా ఓవైపు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా.. మరోవైపు సీఎం కేసీఆర్ రెండుసార్లు బహిరంగ సభ నిర్వహించడంతో పాజిటివ్ కేసులు ఊహించని విధంగా పెరిగిపోయాయి.



Next Story

Most Viewed