నాబార్డు రుణ ప్రణాళిక విడుదల

by  |
నాబార్డు రుణ ప్రణాళిక విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో : నాబార్డు 2021–22 సంవత్సరానికి రూ.1,35,780 కోట్లతో రుణ ప్రణాళికను ప్రకటించింది. ఈ మేరకు బ్యాంకులకు దిశానిర్దేశం చేస్తూ శుక్రవారం రాష్ట్ర రుణ ప్రణాళిక ఫోకస్‌ పేపర్‌ను విడుదల చేసింది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు విడుదల చేసిన ఈ పేపర్‌లో మొత్తం రుణాల్లో దాదాపు 72 శాతానికిపైగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకే కేటాయించాలని సూచించింది. పంట రుణాలకు ఎక్కువగా కేటాయించారు. గతేడాది ఫోకస్‌ పేపర్‌లో రుణ ప్రణాళిక పరిమితి రూ.1,14,578 కోట్లు కాగా, ఈసారి అదనంగా రూ.21 వేల కోట్ల అంచనాలు చూపించారు. దీని ఆధారంగా రాష్ట్ర రుణ ప్రణాళికను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) త్వరలో విడుదల చేయనుంది. వార్షిక రుణ ప్రణాళిక కింద రూ.1,35,780.33 కోట్లు కేటాయించారు. వ్యవసాయ, మార్కెట్ రంగానికి రూ.59,440.44 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాల‌కు రూ.12,881.49 కోట్లు, వ్యవసాయ మౌలిక స‌దుపాయాల కల్పనకు రూ.2764.82 కోట్లు, సూక్ష్మ, చిన్న, మ‌ధ్య త‌ర‌హా ఎంట‌ర్‌ప్రైజెస్‌ల‌కు రూ.39,361 కోట్లు కేటాయించారు.

మూడేళ్లుగా పెరిగిన రుణ ప్రణాళిక

వరుసగా మూడేళ్ల నుంచి నాబార్డు రాష్ట్ర రుణ ప్రణాళిక పెంచుతున్నారు. పంటల సాగు పెరుగుతున్న నేపథ్యంలో వార్షిక ప్రణాళిక కూడా పెరుగుతున్నట్లు ప్రకటించారు. 2019‌‌–2‌‌0లో రూ.1,01,378 కోట్లతో నాబార్డు స్టేట్​ రుణ ప్రణాళిక చేశారు. ఆ సంవత్సరంలో పంట రుణాలకు రూ.49,785 కోట్లు నిర్ణయించారు. మొత్తం వ్యవసాయం, పశు సంవర్ధక, మత్స్యశాఖ సహా అనుబంధ రంగాలకు రూ.70,965 కోట్ల రుణాలు ఇవ్వాలని, అందులో రూ.46,344 కోట్లు పంట రుణాలకు కేటాయించాలని విజ్ఞప్తిచేసింది. 2020–21లో రూ.1,14,578 కోట్లు కేటాయించగా రూ.73,686.16 కోట్లు వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్య శాఖ సహా అనుబంధ రంగాలన్నింటికీ రుణాలివ్వాల్సిన ప్రాధాన్యాన్ని తెలిపింది. ఈసారి ఆర్థిక సంవత్సరానికి రూ.1,35,780.33 కోట్ల రుణ ప్రణాళిక రూపొందించగా వ్యవసాయ, మార్కెటింగ్​ రంగాలకు 59 వేల కోట్లు కేటాయించారు. దీనిలో పంట రుణాలు రూ.48 వేల కోట్లు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.12 వేల కోట్లు ఉండగా ఈసారి కూడా ఆహారశుద్ధి కేంద్రాల ఏర్పాటుకు సహకారం అందించనున్నారు.

రైతులకు అండగా నాబార్డు ఉండాలి : మంత్రి హరీష్​రావు

రాష్ర్టంలో పామ్ ఆయిల్ సాగుకు నాబార్డు స‌హ‌కారం అందించాల‌ని ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు విజ్ఞప్తి చేశారు. నాబార్డు రుణ ప్రణాళిక విడుదల చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో భూగ‌ర్భ జ‌లాల‌తో పాటు తేమ శాతం పెరిగింద‌ని, దీంతో ప‌రివాహ‌క ప్రాంతాల్లో పామ్ ఆయిల్ సాగుకు అనుకూలంగా నేల‌లు మారాయ‌న్నారు. ఈ పంట సాగుకు కోతుల‌, అడ‌వి పందుల బెడ‌ద కూడా ఉండ‌ద‌ని, దేశ ఆదాయం కూడా పెరుగుతుంద‌ని మంత్రి స్పష్టం చేశారు. రైతుల‌కు సంబంధించిన స‌మావేశాలు క్షేత్రస్థాయిలో జ‌ర‌గాల‌ని, రైతు ఆదాయం పెంచ‌డం ల‌క్ష్యంగా నాబార్డు ప‌ని చేయాల‌ని, రైతుల జీవితాల్లో వెలుగులు నింప‌డ‌మే నాబార్డు ప‌ని అన్నారు.

ఒకప్పుడు రైతు ఆత్మహత్యలు ఉండేవని, ఇప్పుడు రైతు ఏ కారణంతో చనిపోయినా బీమా చెల్లిస్తున్నామన్నారు. లేబర్, గోదాములు, ప్రాసెసింగ్ అండ్ ప్యాకింగ్, పంటకు ధర వీటిపై నాబార్డు దృష్టి సారించాలని మంత్రి సూచించారు. పత్తి ఏరే సమయంలో పాఠశాలల్లో డ్రాపౌట్స్​ ఉంటున్నాయని, ప్రస్తుతం వరి నాట్లు వేయడానికి మనుషులు దొరకడం లేదన్నారు. నాటు, పత్తి తీసే యంత్రాలు రైతుల వ‌ద్దకు చేరాలని కోరారు. దేశ అవసరాల కంటే ధాన్యాల‌ ఉత్పత్తి ఎక్కువ అయ్యిందని, ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని, దానికి నాణ్యత, ప్రాసెసింగ్, ప్యాకింగ్ పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. రైతు బిడ్డలను ఎంకరేజ్ చేయాలని, వ్యవసాయ సంబంధ కోర్సులు చేసిన వారికి ఉపాధి కల్పించే అంశంపై సీఎం కేసీఆర్ కూడా ఆలోచన చేస్తున్నారని మంత్రి హ‌రీష్ పేర్కొన్నారు.

ఈ రుణప్రణాళిక సదస్సులో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ రైతుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని స్పష్టం చేశారు. 2022 వ‌ర‌కు రైతుల ఆదాయం రెండింత‌లు పెరిగేలా చేయాల‌ని మోదీ చెబుతున్నారని, కానీ తెలంగాణలో ఇప్పటికే రెట్టింపు అయింద‌న్నారు. క‌రోనా కాలంలో కూడా రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసింద‌ని గుర్తు చేశారు. ప్రస్తుత పార్లమెంట్ స‌మావేశాల్లో సాగు చ‌ట్టాల‌పై చ‌ర్చించి మార్పులు చేయాల‌ని సూచించారు. పార్లమెంట్​ స్టాండింగ్​ కమిటీ అన్ని రాష్ర్టాల్లో పర్యటించి రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శ రామ‌కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Next Story