ఇంటర్ బోర్డు అధికారులపై హత్య నేరం కేసులు..హెచ్ఆర్సీలో ఫిర్యాదు

by  |
AIYF
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: రాష్ట్రంలో లక్షల మంది ఇంటర్ విద్యార్థుల మానసిక క్షోభకు, పలు విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన ఇంటర్ బోర్డు అధికారులపై హత్య నేరం కింద కేసుల నమోదుకు పోలీసు శాఖకు ఆదేశాలివ్వాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వలి ఉల్లాహ్ ఖాద్రి ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు . ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలకు కారణమైన ఇంటర్ బోర్డు అధికారులపై హత్యా నేరం కింద కేసులు నమోదు చేసి చట్టరీత్యా చెర్యలు తీసుకోవాలని హక్కుల కమిషన్ ను కోరినట్లు తెలిపారు . పరీక్షా ఫలితాల్లో ఇంటర్ బోర్డు తప్పిదాలతో రాష్ట్రంలో విద్యార్థినీ, విద్యార్థులు తీవ్ర మానసిక

ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం దారుణం అని వాపోయారు . ఈ ఘటనలపై విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా విద్యార్థినీ , విద్యార్థులు క్లాస్ రూమ్ పాఠాలకు దూరమైన విషయం పరిగణనలోకి తీసుకోకుండా హడావుడిగా పరీక్షలు నిర్వహించి ఫలితాలను ప్రకటించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫెయిల్ అయిన విద్యార్థులకు కనీస మార్కులతో పాస్ చేయాలని అలాగే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఇంటర్ విద్యార్థినీ , విద్యార్థులు ఎవరు ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు . ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగేవరకు ఏఐవైఎఫ్ పోరాటాలు చేస్తుందని వలి ఉల్లాహ్ ఖాద్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్. బాల కృష్ణ, ప్రధాన కార్యదర్శి నిర్లేకంటి శ్రీకాంత్, నాయకులు కె. నరేష్ తదితరులు పాల్గొన్నారు .

Next Story

Most Viewed