చైర్మన్లు వర్సెస్ కమీషనర్లు.. ఎమ్మెల్యే నీడలో మున్సిపల్ కమీషనర్లు

by  |
చైర్మన్లు వర్సెస్ కమీషనర్లు.. ఎమ్మెల్యే నీడలో మున్సిపల్ కమీషనర్లు
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ప్రజాసేవ చేయాలనే అకాంక్షతో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన నేతలు తలలు పట్టుకుంటున్నారు. అధికార పార్టీయైన ఎమ్మెల్యే అనుచరుడిగానో, లేకపోతే ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ మనిషీగానో ప్రజాప్రతినిధులు చలామణీ కావాలి. లేకపోతే ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధిగా పనిచేస్తానంటే ప్రస్తుత ప్రజాస్వామ్యంలో కలగానే మిగిలిపోతుందనే ఆవేదనను పలువురు నేతలు వెల్లడిస్తున్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను గౌరవించాల్సిన అధికారులు సైతం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, ఆ పార్టీ ఇంచార్జీలకు మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో ఆ కమీషనర్లు ఆ మున్సిపాలిటీలో వారు చెప్పిందే వేదం.. చేసిందే పనిగా నడిపిస్తున్నారు.

మున్సిపాలిటీ నిబంధనలకు విరుద్దంగా స్వపక్ష పార్టీ చైర్మన్లైనప్పటికి ఎమ్మెల్యే, ఇంచార్జీ అనుచరుడు కాకపోతే ఐ డెంట్ కేర్ అంటున్న కమీషనర్లు జిల్లాలో ఉన్నారు. పలు అభివృద్ధి పనులపై మున్సిపాలిటీ కార్యవర్గ తీర్మానం చేసినప్పటికి నిధులు విడుదల చేయడంలో కమీషనర్లు జాప్యం చేస్తున్నారు. దీంతో మున్సిపాలిటీ చైర్మన్లుకు, కమీషనర్ల మధ్య వివాధం తలెత్తుతుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 15 మున్సిపాలిటీలు, 4 కార్పోరేషన్లు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలు అధిపత్యం వివాదంతో నిధులు ఖర్చు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రంగారెడ్డి జిల్లాలోని ఆదిబట్ల మున్సిపాలిటీలో అత్యధిక స్ధానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కానీ గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్ టీఆర్ఎస్‌లో చేరిపోయి చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. ఈ చైర్మన్ అధికార పార్టీ పోరును తట్టుకోలేక తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యే తట్టుకోలేక అభివృద్ధికి అడ్డం పడుతున్నట్లు చైర్మన్ ఆరోపిస్తున్నారు. కమీషనర్ ఎమ్మెల్యే చెప్పిన మాటకే కట్టుబడి ఉండటంతో కార్యవర్గంలో తీర్మానం చేసిన డ్రైనేజీ, సీసీరోడ్ల నిర్మాణ పనులకు నిధులు కేటాయించకుండా జాప్యం చేస్తున్నారు. గత రెండెండ్లుగా ఆదిబట్ట మున్సిపాలిటీలో ఒక్క పనిచేయకపోవడం దారుణం. అయితే ఇటీవల కాలంలో ఆదిబట్ల మున్సిపాలిటీకి వ్యక్తిగత నిధులతో రూ.7.90కోట్లు కేటాయిస్తున్నానని చెప్పారు.

ఆ నిధులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహాయంతో తీసుకొస్తున్న నిధులని ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. కానీ ఆ నిధులు మున్సిపాలిటీకి సంబంధించినవేనని బీజేపీ ఫ్లోర్ లీడర్ పొట్టరాములు ఆరోపిస్తున్నారు. ఇదే జిల్లాలోని తుర్కయాంజాల్ మున్సిపాలిటీ కమీషనర్లను తక్షణమే బదిలీ చేయాలని చైర్మన్‌తో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్లు నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. మున్సిపాలిటీలోని మూడు వార్డుల ప్రాంతాలను కలిపి ఓ ట్రంక్ లైన్ ఏర్పాటు చేయాలని స్ధానిక ఎమ్మెల్యేను కొరడం జరిగింది. అందుకు రూ.6 కోట్ల ఖర్చు అవుతుందని కార్యవర్గం చెప్పింది. ఈ నిధుల్లో సగం తమ బడ్జెట్ నుంచి కేటాయిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. దీంతో మున్సిపాలిటి కమీషనర్ ఒక డీపీఆర్, చైర్మన్తో పాటు కార్యవర్గం కలిపి మరో డీపీఆర్ రూపోందించారు. ఆ డీపీఆర్లను ఎమ్మెల్యేకు వివరించడంతో కమీషనర్ చెప్పిన డీపీఆర్ వైపు ఎమ్మెల్యే మొగ్గు చూపారు.

అందుకు చైర్మన్ కమీషనర్‌ను ప్రశ్నిస్తూ మీరు సూచించిన డీపీఆర్ ట్రంక్లైన్ పూర్తి చేస్తారా? అని నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే నిధుల విడుదలో జాప్యం చేస్తున్నారు. అంతేకాకుండా కార్యవర్గం తీర్మానం ఉన్న పనులకు నిదులు విడుదల చేసేందుకు కమీషనర్ అడ్డంకిగా మారిపోయారు. కేవలం ఎమ్మెల్యే చెప్పిన విధంగా కమీషనర్ వ్యవహారిస్తున్నారని కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ఇలా రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలో అభివృద్ధి నిరోధకులుగా ప్రజాప్రతినిధులు మారిపోతున్నారు. నిబంధనలకు విరుద్దంగా మున్సిపాలిటీ కమీషనర్లు అధికార పార్టీ కౌన్సిలర్లు, చైర్మన్లతో కుమ్మక్కై అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు అక్రమ భవన నిర్మాణాలపై ఫిర్యాదులు చేస్తే పట్టించుకోరు. అదే అధికార పార్టీకి చెందిన నేతలు ఫిర్యాదులు చేసినా.. చేతివాటం జరగకపోయినా.. కమీషనర్లు తక్షణమే చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.

Next Story