మీ తోబుట్టువులా ఉంటాం.. జనంలోకి రండి : ఎస్పీ సంగ్రామ్ సింగ్

by  |
Mulugu SP Sangram Singh
X

దిశ, ములుగు: ‘‘వనం వీడి జనంలోకి రండి’’ మీకు అన్నివిధాల సహకరిస్తామని ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మావోయిస్టులకు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లాలోని తాడ్వాయి మండలం కాల్వపల్లిలోని నిషేధిత మావోయిస్టు పార్టీ నేత తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ దామోదర్ తల్లి బడే బతుకమ్మను ములుగు ఎస్పీ కలిసి ధైర్యం చెప్పారు. మొదట ఎస్పీ బతుకమ్మతో మాట్లాడుతూ.. కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ‘‘అవ్వ మీకు ఎలాంటి సమస్య ఉన్నా.. మాకు చెప్పండి అన్ని విధాలా సహకారమందిస్తాం. మీకు తోబుట్టువులా ఉంటాం. మీ కష్టాల్లో పాలు పంచుకుంటాం’’ అని ఆమెకు ఎస్పీ ధైర్యం చెప్పారు. అనంతరం బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు, ఆర్థికసాయాన్ని ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అజ్ఞాత మావోయిస్టులను ఉద్దేశించి మాట్లాడుతూ.. దయచేసి వనం వీడి జనంలోకి రావాలని, మీకు అన్ని విధాలా సహకరిస్తామని అన్నారు.

అనారోగ్యంతో ఉన్న మీకు చికిత్స చేయిస్తామని, ఒత్తిడితో, అనారోగ్యంతో అడవుల్లో ఉండొద్దని సూచించారు. ప్రాణాలతో మీ కుటుంబ సభ్యులను కలవాలని, మీకు అండగా మేము ఉంటామని భరోసా కల్పించారు. గత రెండు నెలలుగా మావోయిస్టు నాయకులు కరోనా బారినపడి మృత్యువాత పడుతున్నారని ఎంతోకాలంగా అజ్ఞాతంలో ఉండి కన్నవారికి తోబుట్టువులకు దూరంగా ఉంటూ మావోయిస్టు పార్టీ ఒత్తిడితో కొనసాగుతున్నారన్నారు. ఇప్పటికే ముఖ్యనేతలందరూ అనారోగ్యంతో అడవుల్లో మృతిచెందుతున్నా.. కేంద్ర కమిటీ దాటవేత ధోరణి ప్రదర్శిస్తూ.. వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అజ్ఞాతంలో ఉన్న ముఖ్యనేతలకు కిందిస్థాయి క్యాడర్‌కు మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంతేగాకుండా.. ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయసహకారాలు అందించడంతో పాటు కుటుంబాలకూ అండగా ఉంటామన్నారు. అనారోగ్యంతో అడవుల్లో వుండడంకన్నా జనజీవనస్రవంతిలోకి వచ్చి కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవితం గడపాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ములుగు ఏఎస్పీ పోతరాజు సాయి చైతన్య, ఏఎస్పీ రూపేష్, సీఐ శ్రీనివాస్, ఎస్సై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

‘‘బిడ్డ ఇంటికిరా నిన్ను చూడాలనిపిస్తుంది
అందరం కలిసి బతుకుదాం
ఒంటరిగా ఉండలేకపోతున్నా’’
– మావోయిస్టు నేత దామోదర్ తల్లి బడే బతుకమ్మ

Next Story

Most Viewed