మహిళా కార్యదర్శులకు వేధింపులు.. అవినీతి MPDO బాగోతం బట్టబయలు

by  |
మహిళా కార్యదర్శులకు వేధింపులు.. అవినీతి MPDO బాగోతం బట్టబయలు
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : వేతన బిల్లు చెల్లించాలంటే చేయి తడపాల్సిందే.. లేదంటే నెలల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు తప్పవు.. ఇదీ శామీర్‌పేట మండలాభివృద్ది అధికారి నిర్వాకం. గత కొన్ని నెలలుగా ఎంపీడీఓ వాణి గర్దాస్.. కార్యదర్శులను లంచాల కోసం వేధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వేతన బకాయిలు చేల్లించాలన్నా.. లీవుల అలవెన్స్‌లు కావాలన్నా.. అభివృద్ధి పనులకు బిల్లుల మంజూరు విషయంలోనూ లంచం డిమాండ్ చేస్తున్నారంటూ పలువురు పంచాయితీ కార్యదర్శులు జిల్లా కలెక్టర్, జడ్పీ సీఈఓతో సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

అయినా.. ఉన్నతాధికారుల నుంచి స్పందన లేకపోవడంతోపాటు, ఎంపీడీఓ వేధింపులు మరింత అధికం కావడంతో విషయం సీఎం పేషీ వరకు వెళ్లింది. తెలంగాణ స్టేట్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ అసిస్టెంట్ రిపోర్టింగ్ ఆఫీసర్ మంగలారపు నాగేశ్వర్ ఫిర్యాదు మేరకు ఎంపీడీఓ వాణి, సూపరింటెండెంట్ ఎం.సంపత్‌లపై జిల్లా పంచాయతీ అధికారి రమణ మూర్తి మంగళవారం విచారణ చేపట్టారు. ఈ అంశం మేడ్చల్ జిల్లాలో ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. మూడు చింతలపల్లి, అలియాబాద్ కార్యదర్శులు చేసిన ఫిర్యాదులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మూడు చింతల పల్లి గ్రామ కార్యదర్శి డి. ఉష 2021, ఆగస్టు 26వ తేదీన మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఎంపీడీఓ వాణి గర్దాస్ ప్రతీ నెల జీతం చెల్లించే విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఆగస్టు 7వ తేదీన వినతి పత్రం ఇచ్చినా.. ఫిబ్రవరి నెల సస్పెండ్ అలవెన్స్ బిల్లు చేసి పంపితే ఎస్టీఓకు పంపడంలేదని ఆరోపించారు. అదేవిధంగా జూన్ నెల సస్పెండ్ అలవెన్స్ బిల్లు రికార్డుపై కూడా సంతకం చేయలేదని, డబ్బులు ఇస్తేనే సంతకం చేస్తానని ఎంపీడీఓ డిమాండ్ చేస్తున్నారని ఉష కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అలియాబాద్ గ్రామ గ్రేడ్-1 కార్యదర్శి కె. సునీత.. శామీర్‌పేట ఎంపీడీఓ లంచం డిమాండ్ చేస్తూ మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని 2021, నవంబర్ 24న జిల్లా ప్రజాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి దేవ సహాయంకు ఫిర్యాదు చేశారు. తాను 2020, అక్టోబర్ 10న అలియాబాద్ కార్యదర్శిగా విధులలో చేరినప్పటి నుంచి ఎంపీడీఓ తనను టార్గెట్ చేస్తూ రకరకాల ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు( కార్యదర్శికి) అనారోగ్య కారణాల వల్ల 220 రోజుల దీర్ఘకాలిక సెలవు పెడితే మంజూరైన వేతన బిల్లును ఇప్పించేందుకు 3 నెలలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ బిల్లు మంజూరు కోసం లంచం డిమాండ్ చేయగా, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానంటే బిల్లుపై సంతకం చేశారని తెలిపారు. అలియాబాద్ గ్రామ సర్పంచ్ సస్పెండ్ అయిన తర్వాత ఎంపీడీఓ, గ్రామ ఉప సర్పంచ్‌లకు జాయింట్ సిగ్నెచర్‌లతో చెక్కులు పాస్ చేసే అవకాశం ఉన్నందున అభివృద్ధి పనుల కోసం రూపొందించిన బిల్లుల చెక్కులపై సంతకం చేయలేదన్నారు. దీంతో పలు చెక్కులు లాప్స్ అయినట్లు పేర్కొన్నారు. దీంతో అభివృద్ది పనుల అవసరాలకు తన భర్తతో గొడవ పడి ఇంట్లో నుంచి డబ్బులు తీసుకువచ్చి చెల్లింపులు చేసినట్లు తెలియజేశారు.

గ్రామంలో పనిచేయకుండానే ఎంబీ నెం.52/బీహెచ్/2020-21,ఎంబీ నెం.53/బీహెచ్/2020-21లలో రికార్డు చేయించుకొని రూ.10 లక్షల బిల్లులు కాజేయాలని ఎంపీడీఓ ప్రయత్నించగా, ఇదే విషయమై 2021, జూన్ 10వ తేదీన గ్రామస్థులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన అవినీతికి అడ్డుపడుతున్నానే ఉద్దేశంతో తనకు 12 నుంచి 18 ఏళ్ల వరకు రావాల్సిన ఆటోమెటిక్ అడ్వాన్స్‌డ్ ఇంక్రిమెంట్ మంజూరు ప్రతిపాదనలను డీపీఓకు పంపడంతోపాటు 30 రోజుల సరెండర్ లీవు అలవెన్స్‌లు మంజూరు చేసేందుకు ఎంపీడీఓ నిరాకరిస్తున్నట్లు సునీత ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామ కార్యదర్శిగా తాను విధులలో చేరక ముందు రూ.60 వేల మొక్కలను పంపించినట్లు తప్పుడు ప్రతిపాదనలు రూపొందించి చెక్ తయారు చేయాలని తనపై ఒత్తిడి తెస్తోందన్నారు.

ఎంపీడీఓపై విచారణ..

పంచాయతీ కార్యదర్శుల వేతనాల చెల్లింపు విషయంలో శామీర్‌పేట ఎంపీడీఓ వాణి గర్దాస్ వేధిస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి రమణ మూర్తి విచారణ చేపట్టారు. ఈ మేరకు మంగళవారం మండల పరిషత్ కార్యాలయాన్ని డీపీఓ సందర్శించి రికార్డులను పరిశీలించారు. ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు ఫిర్యాదులు వెళ్లడంతో కలెక్టర్ హరీష్ ఆదేశాల మేరకు విచారణ చేపడుతున్నట్లు రమణ మూర్తి వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో జిల్లా కలెక్టర్‌కు ఎంపీడీఓ, సూపరింటెండెంట్ సంపత్ ల పై సమగ్ర నివేదికను అందజేస్తానని తెలిపారు.



Next Story