అమరావతిని అడ్డుకునే మేఘాలు అశాశ్వతం..అమరావతే శాశ్వతం: ఎంపీ రఘురామ కృష్ణంరాజు

by  |
Raghurama Krishnam Raju
X

దిశ, ఏపీ బ్యూరో: అమరావతి జేఏసీ తిరుపతిలో మహా పాదయాత్ర ముగింపు సభను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ముగింపు సభకు హాజరు కావాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు జేఏసీ లేఖలు రాసింది. అలాగే వైసీపీ అసమ్మతి నేత, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును సైతం అమరావతి జేఏసీ కన్వీనర్ శివారెడ్డి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామకృష్ణంరాజు శుక్రవారం తిరుపతి చేరుకున్నారు. తిరుపతి విమానాశ్రయం చేరుకున్న ఎంపీ రఘురామకృష్ణంరాజుకు అమరావతి జేఏసీ నేతలు స్వాగతం పలికారు. అక్కడ నుంచి రైతుల మహోద్యమ సభకు ఎంపీ రఘురామ బయలుదేరి వెళ్లారు.

ఈ సందర్భంగా ఎంపీ రఘురామ మాట్లాడుతూ.. అమరావతి రైతులు తిరుపతి లో నిర్వహిస్తున్న సభ దగాపడ్డ రైతుల సభే తప్ప రాజకీయ సభ కాదని చెప్పుకొచ్చారు. అమరావతి రాజధానిని అడ్డుకునే మేఘాలు అశాశ్వతమని.. అమరావతే శాశ్వతం అని ఎంపీ రఘురామ తెలిపారు. అమరావతి రైతులు చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల రైతులు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ మహోద్యమ సభకు రాష్ట్ర నేతలతోపాటు జాతీయ నేతలు సైతం హాజరవుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ సభ తర్వాత మూడు రాజధానుల గురించి మాట్లాడేవారు ఎవరూ ఉండరని చెప్పుకొచ్చారు. అమరావతియే ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా ఉంటుందని అందులో ఎలాంటి సందేహం లేదని ఎంపీ రఘురామకృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు.



Next Story