ధరణి కోసం డీఎస్ పడిగాపులు..

by  |
ధరణి కోసం డీఎస్ పడిగాపులు..
X

దిశప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా బాగుందని చెప్పడం కేవలం రికార్డులకే పరిమితంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజలు, ప్రముఖులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తన వ్యవసాయ భూమి అమ్మకం విషయంలో రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌కు కష్టాలు తప్పలేదు..సుమారు 2 గంటలపాటు సిస్టం ముందు నిరీక్షణ చేసినా రిజిస్ట్రేషన్ సాగక వెనుదిరిగారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఈరోజు ఉదయం 11 గంటలకు నిజామాబాద్ మండలం సారంగాపూర్ గ్రామ శివారు లోని షేర్ పూర్ శివారుకు సంబంధించిన 28/ఆ,28/ఇ,28/ఉ మూడున్నర ఎకరాల భూమిని అష్రఫ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారికి అమ్మినట్లు తెలిసింది. అయితే, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కోసం నిజామాబాద్ రూరల్ ఎమ్మార్వో కార్యాలయానికి ధర్మపురి శ్రీనివాస్ వచ్చారు. ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్ లో భాగంగా నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్ స్లాట్ కూడా బుక్ చేశారు. కానీ, ఎమ్మార్వో కార్యాలయంలోని సిస్టంలో ఐరిష్‌తో పాటు వేలిముద్రలు డీఎస్‌వి సరిపోకపోవడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. నిరాశ చెందిన ఎంపీ వెనుదిరిగారు. ఏకంగా డీఎస్ ధరణిలో రిజిస్ట్రేషన్ కోసం వస్తే ఆన్లైన్ సిస్టం మొరాయించడంతో జాయింట్ సబ్ రిజిస్ట్రార్, ఇతర అధికారులు ఎంత శ్రమించినా ఫలితం లేకుండా పోయింది.



Next Story