భారీగా పెరిగిన టీకా కేంద్రాలు.. ఇదో రికార్డు

by  |
vaccination centers
X

న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ భీకర స్థితిలో వ్యాపిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల పంపిణీయే దీనికి మార్గంగా భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా టీకా కేంద్రాలను పెంచుతున్నది. సోమవారం రికార్డు స్థాయిలో దేశవ్యాప్తంగా 73,600 టీకా కేంద్రాలు పనిచేశాయి. ఇది ఒక రికార్డు. కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల (సీవీసీ) ను ప్రారంభించినప్పటి నుంచి ఇన్ని కేంద్రాలు పనిచేయడం ఇదే ప్రథమం. దేశంలో రోజుకు 45 వేల (సగటున) సీవీసీలు మాత్రమే పనిచేస్తున్నాయి. దీంతో రోజుకు సుమారు 18 లక్షల నుంచి 22 లక్షల మధ్యే వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్నది.

కాగా, సీవీసీల పెంపుతో సోమవారం రాత్రి 8 గంటల వరకు దేశంలో 31.3 లక్షల మందికి వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 21.7 లక్షల మందికి తొలి డోసు వేయగా.. 9.3 లక్షల మంది సెకండ్ డోస్ వేసుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటిదాకా 12.69 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసినట్టైంది. పని ప్రదేశాలలో కూడా వ్యాక్సినేషన్ ఏర్పాటు చేయడంతో టీకా పంపిణీ కార్యక్రమం జోరందుకుంది. ఇదిలాఉండగా మే 1 నుంచి 18 ఏళ్లు దాటినవారందరికీ టీకా వేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం విదితమే.

Next Story

Most Viewed