శతాబ్దం చివరినాటికి 1500 భాషలు కనుమరుగు 

by  |
languages
X

దిశ, ఫీచర్స్: భాష అంటే కేవలం పదాలు లేదా శబ్దాల సమాహారం కాదు. ఒక్కో భాష ప్రత్యేకమైన ప్రపంచాన్ని, సంస్కృతిని సూచిస్తుంది. శతాబ్దాలుగా మానవుని అనుభవం, ఆలోచనలు, భావోద్వేగాల భాండాగారంగానూ భాషను నిర్వచించవచ్చు. అందుకే ఏదైనా భాష అంతరించిపోతే మానవాళి జీవన చిత్రంలో ఒక తలుపు మూసుకుపోయినట్లే అనేది నిపుణుల అభిప్రాయం. అయితే నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఈ శతాబ్దం చివరి నాటికి 1500 కంటే ఎక్కువ భాషలు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఇందుకు అనేక అంశాలు కారణమవుతున్నాయని అధ్యయనం కనుగొంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 6500 నుంచి 7000 భాషలు మాట్లాడుతున్నారని అంచనా. ఇందులో సగానికి పైగా భాషలకు ముప్పు పొంచి ఉందని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ (ఏఎన్‌ఐ) పరిశోధకులు చెబుతున్నారు. రానున్న 40 సంవత్సరాల్లో భాషకు సంబంధించిన నష్టం మూడు రెట్లు పెరుగుతుందని అధ్యయన సహ రచయిత ఫెలిసిటీ మీకిన్స్ నివేదికలో ప్రస్తావించారు. అంటే నెలకు ఒక భాష చొప్పున అంతరించే ప్రమాదముందని అర్థం. ఈ మేరకు ప్రపంచ దేశాలు కమ్యూనిటీ-లెవెల్ డాక్యుమెంటేషన్, బైలింగువల్ ఎడ్యుకేషన్‌లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని అధ్యయనం చెబుతోంది.

వలసలు, ఆర్థిక కారణాలతో పాటు రాజకీయాలు కూడా భాషల అణచివేత పై ప్రభావం చూపుతున్నాయి. కాగా క్రూరమైన వలసవాద విధానాల వల్లే ఆస్ట్రేలియాలోని స్థానిక భాషలు అంతరించిపోతున్నాయని పరిశోధకులు గమనించారు. లోకల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్న స్థానికులకు వలసవాదులు తరచూ శిక్షలు విధిస్తున్నారు. ఇటువంటి విధానాలే తరతరాలుగా పిల్లలకు తమ భాషను నేర్పడాన్ని కష్టతరం చేశాయి.



Next Story

Most Viewed