త్వరలోనే సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. మరిన్ని పదవుల భర్తీకి రంగం సిద్ధం

by  |
CM KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ అధిష్టానం నామినేటెడ్ పోస్టులపై దూకుడు పెంచింది. గత ఏడేళ్లుగా భర్తీ కాకుండా ఉన్న కార్పొరేషన్లను సైతం భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతుంది. పార్టీ నేతల్లో అసంతృప్తిని దూరం చేసేందుకు, కేడర్ ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా కాపాడుకునేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గత వారం రోజులుగా పది కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించి పార్టీకోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ పదవులు ఇస్తామని, యువతకు పెద్దపీట వేస్తామని చెప్పకనే చెప్పింది. అసెంబ్లీ ఎన్నికలు మరో రెండేళ్లు ఉన్నప్పటికీ ఇప్పటినుంచే పార్టీ నేతలు, కేడర్ ను సన్నద్ధం చేసే పనిలో అధిష్టానం నిమగ్నమైంది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించలేదు. కేవలం కొన్ని కార్పొరేషన్లకు మాత్రమే నియమించింది. వాటికి సైతం డైరెక్టర్లను గానీ, కమిటీ సభ్యులను సైతం నియమించలేదు. అయితే రోజురోజుకు మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నామినేటెడ్ పదవుల భర్తీపై టీఆర్ఎస్ అధిష్టానం దృష్టి సారించింది. రాష్ట్రంలో సుమారు 80వరకు కార్పొరేషన్లు ఉన్నప్పటికీ అందులో 67 ప్రాధాన్యత కలిగిన వాటిగా గుర్తించింది. అయితే వాటికీ సైతం చైర్మన్లను నియమించకపోవడంతో పార్టీకోసం పనిచేస్తున్న నేతల్లో కొంత అసంతృప్తి ఉంది. అంతేగాకుండా ఇతర పార్టీల నుంచి పదవుల కోసం ఆశించి వచ్చినప్పటికీ వారికి సైతం కేసీఆర్ ఏ పదవి అప్పగించలేదు. చేరిక సమయాల్లో కీలక పదవులు ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వకపోవడంతో కొంత నిరాశలో ఉన్నారు.

హుజూరాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో ఎస్సీ, బీసీ కమిషన్లను ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత ఆర్టీసీ చైర్మన్ ను నియమించింది. మళ్లీ నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టలేదు. దీంతో పదవులు ఆశిస్తున్న నేతలు అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఉండటం, టీఆర్ఎస్ లో పదవులు రావని, ఉద్యమ కారులకు గుర్తింపు ఉండదని భావించిన నేతలు ఇతర పార్టీలకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఉద్యమ కాలంలో ఉద్యోగ సంఘాల నేతగా పనిచేసిన విఠల్ బీజేపీలో చేరడం, ఆయన బాటలోనే మరికొంత మంది చేరికకు రంగం చేసుకుంటుండటంతో గ్రహించిన అధిష్టానం కట్టడి చేసేందుకు నామినేటెడ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. నాలుగు రోజుల వ్యవధిలోనే పది కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. ఎర్రోళ్ల శ్రీనివాస్‌ (మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌), మన్నె క్రిషాంక్‌ (టీఎస్‌ఎండీసీ), సాయిచంద్‌ (వేర్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌), పాటిమీది జగన్‌ (టీఎస్‌టీఎస్‌), గజ్జెల నగేశ్‌ (బీవరేజెస్‌ కార్పొరేషన్‌), దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ (గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ), ఆకుల లలిత (మహిళా ఆర్థిక సంస్థ), జూలూరు గౌరిశంకర్‌ (సాహిత్య అకాడమీ) చైర్మన్లుగా నియమించగా, రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్‌గా డాక్టర్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వంటేరు ప్రతాప్‌రెడ్డి పదవీ కాల పరిమితిని మరో రెండేళ్లు పెంచింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో వకుళాభరణం కృష్ణమోహన్ (బీసీ కమిషన్), బండ శ్రీనివాస్ (ఎస్సీ కార్పొరేషన్), బాజీరెడ్డి గోవర్ధన్ ( ఆర్టీసీ చైర్మన్) గా నియమించింది. మరికొన్నింటికి కార్పొరేషన్ చైర్మన్లను నియమించింది. సుమారు 20 కార్పొరేషన్లకు చైర్మన్లు ఉన్నప్పటికీ బీసీ కమిషన్ కు మినహా ఏ కార్పొరేషన్ కు సభ్యులను ప్రభుత్వం నియమించలేదు.

పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారితో పాటు ఉద్యమ సమయంలో అనుంబంధసంఘాలైన విద్యార్థి, యువజన, సాంస్కృతిక, రైతు విభాగాల్లో చురుగ్గా పనిచేసిన వారి వివరాలను సేకరిస్తుంది. వారితో పాటు ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరినా పదవులు పొందని వారిని గుర్తించి నామినేటెడ్‌ పదవుల భర్తీ ప్రక్రియను పార్టీ అధిష్టానం చేపడుతోంది. సుమారు 50 వరకు వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు, పాలక మండళ్లు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటంతో వాటిని వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు సన్నద్ధమైంది. పార్టీలో అసంతృప్తులు లేకుండా చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే సామాజిక పరంగా చర్యలు తీసుకుంటుంది. అంతేగాకుండా కమిషన్ చైర్మన్ గా నియమిస్తే లాభనష్టాలను సైతం బేరీజు వేస్తున్నట్లు సమాచారం. నియామకం అయ్యే వ్యక్తితో ప్రయోజనం ఉంటేనే బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిసింది. పదవుల కోసం కేసీఆర్, కేటీఆర్ లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రగతి భవన్ చుట్టూ ఆశావాహులు ప్రదక్షిణలు చేస్తున్నారు. అంతేగాకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చే వారికి సాష్టాంగ నమస్కారాలు సైతం చేయడం గమనార్హం.

ఏడేళ్లుగా ఫెడరేషన్లకు నియామకం లేదు

రాష్ట్రంలో కులాలకు చెందిన 13 కార్పొరేషన్లు ఉన్నాయి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో కార్పొరేషన్లకు నిధులు లేవు… కార్పొరేషన్లకు చైర్మన్లను సైతం నియమించలేదు. దీంతో కులసంఘాలు ప్రభుత్వంపై ఆసంతృప్తితో ఉన్నాయి. అయితే కులసంఘాలకు చెందిన కొంత మంది నేతలతో వ్యతిరేకతను కొంత మేర తగ్గిస్తూ వస్తుంది. అయితే వ్యతిరేకత పెరుగుతుండటంతో వాటికి సైతం చైర్మన్లను నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే నియమిస్తుందా? లేదా? అనేదానిపై మాత్రం స్పష్టత లేదు.

ఇక్కడ ధర్నాలు.. అక్కడ దరఖాస్తులు..



Next Story

Most Viewed