పొరపాటా? కావాలనే చేసిందా? చైనాపై అనుమానాలు

by  |
పొరపాటా? కావాలనే చేసిందా? చైనాపై అనుమానాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా విషయంలో చైనాపై అంతర్జాతీయ సమాజం అనుమానాలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. కరోనాపై తొలుత ఎన్నో అబద్ధాలు చెప్పిన చైనా ఇప్పటికీ సరైన సమాచారం ఇవ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కరోనా కారణంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వైరస్ పుట్టిన చైనాలో అతి తక్కువ మరణాలు సంభవించడంపై మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ కావాలనే మృతుల సంఖ్యను తక్కువ చేసి చెబుతోందని ఆరోపణలు వచ్చాయి. కానీ, వీటిని ఎప్పటికప్పుడు చైనా ఖండిస్తూ వచ్చింది. తొలి సారిగా వూహాన్‌లో మరణించిన వాళ్ల సంఖ్యను ఆ నగర పాలక సంస్థ పెంచి చెప్పడం మరో సారి అనుమానాలకు తావిచ్చింది. గురువారం వరకు 2,579 మందే చనిపోయారని చెప్పిన వూహాన్ స్థానిక ప్రభుత్వం.. శుక్రవారం ఒక్క సారిగా మరణాల సంఖ్యను 3,869 అని చెప్పింది. దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 40 శాతం పెరిగిపోయింది. ఒకే సారి ఇంత తేడా ఎలా వచ్చిందని ప్రపంచ దేశాలు ప్రశ్నిస్తున్నాయి. అమెరికా విచారణకు పట్టుబడుతున్న సమయంలో ఇలా మరణాల సంఖ్యను పెంచి చూపించడం చైనా నిబద్దతపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ఇది పొరపాటుగా జరిగిందని.. వైరస్ తీవ్ర రూపంలో ఉన్న సమయంలో వూహాన్ నగరంలో అనేక పరిమితుల కారణంగా సంఖ్యను నివేదించడంలో పొరపాటు జరిగినట్లు చెబుతోంది. ప్రైవేటు, తాత్కాలిక ఆసుపత్రుల నుంచి సమాచారం రావడంలో ఆలస్యం అవడం వల్లే అప్పట్లో ఆ మరణాలను కలపలేదని చెబుతోంది. కాగా, చైనా నిర్లక్ష్యంపై ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. రోజుకో విధంగా చైనా వ్యవహరిస్తుండటం.. పొరపాట్లు చేశామని చెప్పుకోవడంపై ఆగ్రహంగా ఉన్నాయి. చైనా కావాలనే ఇలా చేస్తోందని ప్రపంచదేశాలు ఆరోపిస్తున్నాయి. చైనా అసలు రంగు బయటపడాలంటే విచారన జరపాల్సిందేనని ముక్త కంఠంతో కోరుతున్నాయి.

Tags: coronavirus, china, wuhan, pandemic, cases, deaths, different numbers



Next Story

Most Viewed