అసలు ముప్పు ఇప్పుడే.. ఆపకపోతే ఇక అంతే!

by  |
అసలు ముప్పు ఇప్పుడే.. ఆపకపోతే ఇక అంతే!
X

దిశ, ఆదిలాబాద్: లాక్‌డౌన్ నిబంధనల్లో కేంద్రప్రభుత్వం కొన్ని సడలింపులిచ్చింది. దీంతో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలసకూలీలు, ఇతరులు స్వరాష్ట్రానికి చేరుకుంటున్నారు. వారికి సరిహద్దుల వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేసి వారివారి స్వగ్రామాలకు పంపిస్తున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కానీ, అసలు ముప్పు ఇప్పుడే చుట్టుకునే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అదేమిటంటే..

ఉపాధి కోసం తెలంగాణ ప్రాంతం నుంచి లక్షలాది మంది మహారాష్ట్రకు వెళ్లి కార్మికులుగా పనిచేస్తున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ లతోపాటు మరికొన్ని జిల్లాల నుంచి ఎక్కువగా మహారాష్ట్రలో కూలీలుగా పనిచేస్తున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం వలస వెళ్లిన కుటుంబాలు అక్కడే స్థిరపడగా అలాంటివారి సహకారంతో వేలాదిమంది కార్మికులు మహారాష్ట్రకు వెళ్లి వివిధ కర్మాగారాలు, మిల్లుల్లో కూలీలుగా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. మహారాష్ట్రలో ఇండస్ట్రీయల్ ఏరియాగా పేరున్న ప్రముఖ పట్టణాల్లో తెలంగాణ కార్మికులు ఎక్కువగా ఉపాధి పొందుతున్నారు. ఈ ప్రాంతంలో గతంలో కరువుఛాయలు ఏర్పడిన ప్రతి ఏటా దుబాయి లేదంటే బొంబాయి అన్నట్లుగా… వేలాది కార్మికులు వలస వెళ్లేవారు. ముంబైతోపాటు బీవండి, షోలాపూర్, ధారావి, ఔరంగాబాద్, అకోలా, నాందేడ్, జాల్నా, పర్భణీ తదితర పట్టణాలకు సమీపంలో ఉన్న పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా పత్తి, దారం మిల్లులు, చక్కెర కర్మాగారాలు, దాల్ మిల్లులతోపాటు సిమెంట్ ఫ్యాక్టరీలు, భవన నిర్మాణ రంగం, వాహనాల కర్మాగారాల్లో పెద్ద ఎత్తున తెలంగాణ కూలీలు అక్కడ పనిచేస్తుంటారు.

ఉపాధిలేక తిరిగి రాష్ట్రానికి…

కరోనా దెబ్బకు దేశం మొత్తం మీద ఉన్నట్టే మహారాష్ట్రలోనూ అన్నిరంగాల కర్మాగారాలు, మిల్లులు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఉపాధి పొందుతున్న తెలంగాణ కార్మికులందరూ క్రమంగా స్వరాష్ట్రానికి తరలివస్తున్నారు. వారం రోజులుగా మహారాష్ట్ర నుంచి తిరిగి వస్తున్న వలస కూలీల సంఖ్య భారీగా పెరుగుతోన్నది. ఇప్పటికే స్థిరనివాసం ఏర్పరచుకున్నవారు మినహా మిగతా కూలీలు స్వస్థలాలకు వచ్చేందుకే మొగ్గుచూపుతున్నారు. కూలీలను అక్కడి ప్రభుత్వం తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నది.

అసలు ముప్పు ఇప్పుడే..

మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వలస కూలీల రాక అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోన్నది. దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో ఇంతకాలం ఉపాధి పొందిన కార్మికులు ఇటు తిరిగి వస్తుండడం ఆందోళనకు కారణం అవుతోన్నది. చెక్‌పోస్టుల వద్ద వారికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నప్పటికీ దీని ద్వారా పూర్తిస్థాయిలో నివారించలేమని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రను ఆనుకుని ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల మీదుగా వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున వలస కూలీలు జిల్లాలకు చేరుకుంటున్నారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్- బిడ్రెల్లి, బెల్ తరోడా, సిరిపల్లి, ఆదిలాబాద్ జిల్లాలోని బోరజ్, ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి – గో యాగం, కాగజ్ నగర్ సమీపంలోని సిర్పూర్ (టీ), ఆహిరిల మీదుగా మహారాష్ట్ర నుంచి ఈ ప్రాంతానికి వలసకూలీలు చేరుకుంటున్నారు. కాలినడకన వస్తున్నవారు చెక్‌పోస్టుల మీదుగా కాకుండా దొడ్డిదారిన కూడా సరిహద్దుల్లోకి చేరుకొని స్వగ్రామాలకు వెళ్లిపోతున్నారు. ఇలాంటివారికి ఆరోగ్య పరీక్షలు కూడా చేయలేకపోతున్నారు. తిరిగి వస్తున్న వలస కార్మికులు కరోనా వైరస్‌ను మోసుకు వస్తే… వాటిల్లే ముప్పు మనం ఇంతకాలం కాపాడుకున్న దానికన్నా ఎక్కువగా ప్రభావం చూపుతుందని ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రభుత్వాలు అనుమతించడంతో ట్యాక్సీలు, ప్రైవేటు బస్సులు, రైళ్లలో కార్మికులు తరలివస్తున్నారు. అయితే వీరందరికీ ఖచ్చితంగా 14 రోజుల హోం క్వారంటైన్ అమలు చేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ కరోనా ప్రభావం కనిపించడం లేదన్న ధీమాతో ఉంటే అసలు ముప్పు ఇప్పుడే చుట్టుకునే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు.

Next Story

Most Viewed