మమతలను చిదిమేస్తున్న రూపాయి !

by  |
మమతలను చిదిమేస్తున్న రూపాయి !
X

దిశ, ఏపీ బ్యూరో: తిరుపతి బస్టాండ్​ యాత్రికుల సందడితో కిక్కిరిసింది. ఆ ముగ్గురి మధ్య మాటల్లేవ్​. కన్నీళ్లు మాత్రమే మాట్లాడుకుంటున్నాయ్. ఏదో తెలియని గుబులు. గుండెల్ని పిండేస్తోంది. చెన్నై బస్సు బయల్దేరడానికి సిద్ధంగా ఉన్నట్లు మైకులో అనౌన్స్​మెంట్. బ్యాగులు భుజానికి తగిలించుకున్నారు. కన్నబిడ్డ​లు కళ్లముందు లేకుండా వెళ్తుంటే ఆ తండ్రి కన్నీటిపర్యంతమవుతున్నాడు. రూపాయి తమ జీవితాల్లో సృష్టించిన ప్రకంపనలకు ముగ్గురు తల్లడిల్లుతున్నారు. ఇద్దరు ఆడ బిడ్డలు బరువెక్కిన గుండెతో బస్సెక్కారు. ఆ తండ్రి కన్నీళ్లు చూసిన బిడ్డల వెక్కిళ్లతో బస్సు బయల్దేరింది.

నాయుడికి ముగ్గురు సంతానం. చిత్తూరు జిల్లా మారూమూల ప్రాంతం నుంచి బతుకుదెరువు కోసం ముప్ఫై ఏళ్ల కిందటే తిరుపతి వచ్చేశాడు. అప్పటికే ఇద్దరు ఆడ బిడ్డల పెళ్లిళ్లు చేశాడు. మగపిల్లాడికి వివాహమై అత్తారింటి దగ్గరే సెటిలయ్యాడు. నాయుడి కాలం చేసింది. తండ్రి ఆలనాపాలనా చూసుకునేందుకు బిడ్డలే దగ్గరుండి మరో అమ్మను ఇచ్చి పెళ్లి చేశారు. మనవళ్లు, మనవరాళ్లు, కొడుకు బిడ్డలంతా తిరుపతిలోనే ఉంటారు. కాలం హాయిగా సాగిపోతుండగా రూపాయి ఆ కుటుంబ బంధాల మధ్య చిచ్చు పెట్టింది. ఆయన పెద్ద కూతురు రమణ. అల్లుడు కుటుంబ బాధ్యతలను పట్టించుకోకుండా వదిలేసినా ఆమె తన ఇద్దరు ఆడపిల్లలను పెంచి ఒకింటివాళ్లను చేసింది. చిన్న కూతురు పెనిమిటి కూడా అంతే. కాకుంటే ఆమె కొడుకూ కూతురు ఇంకా సెటిలవలేదు. పెద్ద కూతురుకు తీర్చలేని అప్పులు నెత్తికెక్కి తొక్కుతున్నాయి. చిన్నామెకు పెద్దగా అప్పుల్లేకున్నా చేయడానికి పన్లేదు. ఎదుగుతున్న పిల్లల భారంతో పెనుగులాడుతోంది. రమణకు అప్పుల బాధ గుక్క తిప్పుకోనీయలేదు. తండ్రిగా ఆమె బాధలు చూడలేక ఆమె అప్పులకు తాను హామీ పత్రం రాసిచ్చాడు. దీంతో నాయుడి భార్య అలిగి ఎటో వెళ్లిపోయింది. తండ్రి దీనావస్థ చూసి ఆ ఆడబిడ్డలు చలించిపోయారు. ఏదో పనిచేసి తిరిగి తండ్రి తోడును కలపాలనుకున్నారు. చెన్నైలోని ఓ పెద్దింట్లో రమణ, ఆమె చెల్లెలు వంట పనికి కుదిరారు. నలభై ఏళ్లు పైబడి కుటుంబ బరువు బాధ్యతలను మోయలేక దూరంగా వెళ్తుంటే నాయుడు కన్నీటితో వీడ్కోలు పలికాడు. మనుషులు సృష్టించిన రూపాయి మమతల గొంతు నులిమేస్తుంటే.. మానవత లోపించిన సమాజం వికటాట్టహాసం చేస్తోంది. దీనికి విరుగుడెప్పుడో !



Next Story

Most Viewed