మరికొద్ది నెలల్లోనే కొవిడ్-19కు వ్యాక్సిన్: ఆంటోని ఫౌసీ

by  |
మరికొద్ది నెలల్లోనే కొవిడ్-19కు వ్యాక్సిన్: ఆంటోని ఫౌసీ
X

వాషింగ్టన్: కొవిడ్-19 వైరస్‌కు సరైన చికిత్స విధానం లేకపోవడంతో అందరూ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 140కి పైగా వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉండగా వీటిలో నాలుగైదు మాత్రమే క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. కాగా, అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌసీ వ్యాక్సిన్‌పై కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం ఈయన అధినేతగా ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ సంస్థ, అమెరికా ఫార్మా కంపెనీ మోడెర్నాతో కలసి టీకాను అభివృద్ధి చేస్తున్నది. ‘ప్రస్తుతం పలు రకాల వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయి. జనవరి నుంచి చేస్తున్న ప్రయోగాల్లో కొన్ని విజయవంతమయ్యాయి. మోడెర్నా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ఆశాజనకమైన ఫలితాలను ఇస్తున్నది. అయితే, ఇందుకోసం మరి కొన్నాళ్లు వేచి చూడక తప్పదు. ఈ వ్యాక్సిన్ విజయవంతమైతే 2021లో మార్కెట్‌లోకి వస్తుంది’ అని డాక్టర్ ఫౌసీ చెప్పారు. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలిగతే మనం సగం విజయం సాధించినట్లేనని ఆయన అన్నారు.

Next Story