టీఆర్ఎస్‌కు ఉప ఎన్నికపై ఉన్న శ్రద్ధ.. రైతులపై లేదు : జీవన్ రెడ్డి

by  |
MLC Jeevan Reddy
X

దిశ, కరీంనగర్ సిటీ: టీఆర్ఎస్ ప్రభుత్వానికి హుజురాబాద్ ఉప ఎన్నిక మీద ఉన్న శ్రద్ధ, రైతుల సమస్యలపైన లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. వరి ధాన్యం కోతలు ప్రారంభమైన నేపథ్యంలో తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌కు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌తో కలిసి జీవన్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… వ్యవసాయ ఉత్పత్తులకు పూర్తిస్థాయిలో మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న సహా ఇతర పప్పు దినుసులతో పాటు నూనెగింజలకు కూడా కనీస మద్దతు ధర కల్పన పట్ల రాష్ట్ర ప్రభుత్వం సరైన స్పష్టత ఇవ్వడం లేదని, దీంతో రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని తెలిపారు.

మొక్కజొన్న పంటకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రూ.1870 అమలు చేయకుండా, వ్యాపారస్తులు కేవలం రూ.1500 లకే పరిమితం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు టీఆర్ఎస్ నాయకుల దాడిలో తీవ్ర గాయాలు పాలై, నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిడ్ మానేరు భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు కూస రవిని వారు పరామర్శించారు. అవినీతిని ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగుతున్న అధికార పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంజన్ కుమార్, సత్యం, అంజనేయులు గౌడ్, నాయక్, ప్రభాకర్, మోసిన్, శ్రీనివాస్ రెడ్డి, సత్యం, వెంకటరమణ, రాజిరెడ్డి, శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


Next Story