తలుపు తడుతున్న ‘కల్యాణ లక్ష్మి’

by  |

దిశ, ఆదిలాబాద్:

అధికారులు, నాయకుల ఇళ్ళ చుట్టూ రోజుల తరబడి తిరిగినా అందని కల్యాణ లక్ష్మి చెక్కులు.. ఇప్పుడు పెళ్లి కూతుళ్ల ఇల్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. కరోనా నేపథ్యంలో కల్యాణ లక్ష్మి చెక్కులను ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఇళ్లకు తెచ్చి అందజేస్తున్నారు. పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకు ప్రభుత్వం అందించే కానుక కల్యాణ లక్ష్మి కోసం నిరుపేద కుటుంబాలు పడే వేదన అంతా ఇంతా కాదు. ప్రభుత్వం నుంచి సకాలంలోనే మంజూరవుతున్నప్పటికీ ప్రజాప్రతినిధులు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఆర్భాటంగా నిర్వహించేవారు. ఒకేసారి వందకు పైగా జంటలను, వారి కుటుంబ సభ్యులను పిలిపించి మరీ కార్యక్రమాలను ఏర్పాటు చేసేవారు. ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరై వేదికల మీద చెక్కులు పంపిణీ చేసేవారు. కరోనాతో పరిస్థితి మారిపోయింది. మంజూరైన చెక్కులను వచ్చినట్టే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నూతన వధువుల ఇళ్లకు వెళ్లి, వారి కుటుంబ సభ్యులకు అందజేస్తున్నారు. కరోనా వల్ల లబ్ధిదారులు ఇల్లు విడిచి బయటకు రాలేక.. చెక్కుల కాలపరిమితి ముగిసిపోతే ప్రజల్లో తమకు చెడ్డ పేరు వస్తుందన్న భయంతో నేతలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పెళ్లి కానుకను అందజేస్తున్నారు.ఖానాపూర్ నియోజకవర్గం‌లో ఒకే రోజు కలమడుగు, మురిమడుగు, ఇంధన‌పల్లి, జన్నారం గ్రామాల్లో ఎమ్మల్యే రేఖా నాయక్ ఇంటింటికీ వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు.

Tags: MLA, home, distribute, Kalyana Lakshmi, checks, adilabad, corona



Next Story