పరామర్శకు వెళ్లి… నదిలో చిక్కుకున్న ఎమ్మెల్యే

by  |
పరామర్శకు వెళ్లి… నదిలో చిక్కుకున్న ఎమ్మెల్యే
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు రాష్ట్రాల్లో గతకొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వర్షాల కారణంగా వాగులు, కాల్వలు, చెరువులు నిండి పొంగి పొర్లుతున్నాయి. దీంతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో చాలా గ్రామాలు వరద ముంపులో ఉన్నాయి. ఈ క్రమంలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఓ ఎమ్మెల్యే చిక్కుకుపోయారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ వద్ద చోటుచేసుకుంది.

వివరాళ్లోకి వెళితే.. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కొందరు నేతలు బాడవ గ్రామానికి వెళ్లడానికి మర పడవలో బయలుదేరారు. పరిస్థితులను పరిశీలించి తిరిగి వస్తుండగా చించినాడ వద్ద సాంకేతిక లోపంతో నది మధ్యలో పడవ ఆగిపోయింది. వరద ఉద్ధృతికి పడవ కొంతదూరం అలాగే ముందుకెళ్లి ఓ మూలకు చేరుకోవడంతో పడవను చెట్టుకు కట్టినట్టు సమాచారం. సమాచారం అందుకున్న అధికారులు ఎమ్మెల్యే కోసం టూరిజం బోటును పంపించారు.

గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో యలమంచిలి మండలంలోని లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. కనకాయలంక, పెదలంక, లక్ష్మీపాలెం, యలమంచిలి లంక, బాడవ గ్రామాలు పూర్తిగా జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ఈ గ్రామల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. గ్రామంలోనూ కేవలం నాటు పడవలపైనే ప్రయాణించాలి. దాదాపు 1700లకు పైగా ఇళ్లు వరద నీటిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆయా గ్రామాల పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గోదావరి నదిలో చిక్కుకుపోయారు.

Next Story

Most Viewed