ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం

by  |
best teachers
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అభివృద్ధి విద్యతోనే సాధ్యమవుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపికైన ఉపాధ్యాయులను సన్మానించారు. ఉత్తమ సేవలు అందించిన 111 మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, అధ్యాపకులకు మంత్రి సబితా ప్రశంస పత్రాలు, రూ.10 వేల నగదు, మెడల్‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో తొలిసారి డిజిటల్ తరగతులను ప్రారంభించింది తెలంగాణలోనే అని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలపై నమ్మకంతో కొత్తగా 2.5 లక్షల మంది విద్యార్థులు చేరారని ప్రకటించారు.

కొవిడ్ సమయంలో విద్యార్థులకు విద్యను అందించేందుకు ప్రయత్నం చేసిన ఉపాధ్యాయులను అభినందించారు. ఏడాదిన్నరగా ఫిజికల్ తరగతులు లేక విద్యార్థులకు వచ్చిన గ్యాప్‌ను ఫిల్ చేయాల్సిన బాధ్యత ఉపాద్యాయులదేనని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 1000 గురుకులాలను ప్రారంభించి పేద విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో విద్యను అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈ తరహా నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ప్రైవేటు పాఠశాల తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈ ఏడాది నుంచి స్కూల్ డే ను జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పేరెంట్స్ టీచర్ల మీటింగ్ ఏర్పాటు చేసి విద్యార్థులు చదువు పరిస్థితులను వివరించాలని చెప్పారు. పాఠశాలలకు అవసరమైన ఏర్పాట్లను స్థానిక సంస్థల చే పొందాలని సూచించారు.

బడ్జెట్‌తో సంబంధం లేకుండా విద్యాసంస్థల్లో సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు అదనంగా రూ.4 వేల కోట్లు కేటాయించమని తెలిపారు. విద్యపట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చేపట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. విద్యార్థి, ఉపాధ్యాయులకు మధ్య బండింగ్ తగ్గిపోయిందని ఈ పరిస్థితులను అధిగమించేలా టీచర్లు కృషి చేయాలని సూచించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పాఠశాలలు నిర్వహించి విద్యార్థులకు నాణ్యమై విద్యను అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కె.జనార్దన్ రెడ్డి, కె.రఘోత్తమ్ రెడ్డి, నర్సిరెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, కమిషనర్లు నవీన్ మిట్టల్, ఒమర్ జలీల్, శ్రీదేవసేన, స్థానిక కార్పొరేటర్ విజయ రెడ్డి పాల్గొన్నారు.



Next Story