వాళ్లు నా కుటుంబసభ్యులు.. మంత్రి వేముల ఆసక్తికర వ్యాఖ్యలు

by  |
Minister Vemula Prashanth Reddy
X

దిశ, బాల్కొండ: ‘‘ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో నాతో నడిచే వాళ్లందరూ నా ఆత్మీయులు, కుటుంబ సభ్యులే’’ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం వేల్పూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం తన మిత్రుల సహకారంతో సుమారు రూ. 31 లక్షల వ్యయంతో 8 ఐసీయూ, 6 ఆక్సిజన్ బెడ్స్‌ను మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడక ముందు జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో కనీసం ఐసీయూ బెడ్ లేని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను వినూత్న రీతిలో మెరుగుపరుస్తోందని తెలిపారు. జిల్లాలో కరోనా కట్టడికి కలెక్టర్ నారాయణరెడ్డి, వైద్య సిబ్బంది ఎంతో కృషి చేశారని, వారి పని తీరుతో నాకు ఆత్మీయులు అయ్యారని, వారి పనిమీద పూర్తి విశ్వాసం ఏర్పడిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సెకండ్ వేవ్‌లో ఎంతోమంది ఆత్మీయుల్ని కోల్పోయామని, ఎంత డబ్బు ఉన్నా.. దగ్గర్లో అత్యవసర సౌకర్యాలు లేక వారిని కాపాడుకోలేక పోయామని, దాని మూలంగా వ్యక్తిగతంగా చాలా బాధపడ్డానన్నారు. నా మిత్రుల సహకారంతో రూ. 1.5 కోట్లతో బాల్కొండ నియోజకవర్గ ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలోని 12 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం ఐసీయూ, ఆక్సిజన్ బెడ్స్, ఆపరేషన్ థియేటర్స్, వాటర్ ఆర్వో ప్లాంట్ అందుబాటులో ఉన్నాయని అన్నారు. నా సతీమణి నీరజారెడ్డి సైతం ఆసుపత్రుల అభివృద్ధి కోసం రూ.25 లక్షలు ఇచ్చిందని చెప్పారు. ఇటీవల ఒక మిత్రుడు రూ.27లక్షల విలువ గల ఆక్సిజన్ అంబులెన్స్ విరాళంగా ఇచ్చాడని, అది మోర్తాడ్ కేంద్రంగా నియోజకవర్గం అంతా వినియోగంలోకి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సతీమణి వేముల నీరజారెడ్డి, డీఎంహెచ్ఓ సుదర్శనం, జిల్లా హెల్త్ సూపరింటెండెంట్ డా.ప్రతిమారాజ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.రమేష్, వేల్పూర్ పీఎచ్‌సీ డాక్టర్ అశోక్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed