సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి బెస్ట్ పాలసీ: తలసాని

by  |
సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి బెస్ట్ పాలసీ: తలసాని
X

దిశ, న్యూస్‌బ్యూరో: సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కోసం దేశంలోనే బెస్ట్ పాలసీ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సినీరంగం పట్ల సానుకూలంగా ఉన్నామని, సినిమా, టీవీలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకునేలా ఇప్పటికే ఆదేశాలను జారీ చేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. బుధవారం మాసాబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో సినీ ప్రముఖులు, టీవీ చానళ్ల నిర్వాహకులతో మంత్రి సమావేశం నిర్వహించారు. లాక్‌డౌన్‌తో లక్షలాది మంది కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని సినీ ప్రముఖులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సుమారు 85సినిమాల షూటింగ్‌లు వివిధ దశల్లో ఉన్నాయని, మరికొన్ని షూటింగ్‌లు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉన్నాయని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే షూటింగ్ ప్రాంతాల్లో ఎదురయ్యే ఇబ్బందులు, సినిమా థియేటర్లను తెరిచిన తర్వాత పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ రాంమోహన్ రావు, ఫిలిం ఛాబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మురళి మోహన్, నిర్మాతలు సి. కళ్యాణ్, దిల్‌రాజు, సురేందర్‌రెడ్డి, దామోదర్ ప్రసాద్, డైరెక్టర్ ఎన్.శంకర్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు నరేష్, జీవిత, ఎగ్జిబిటర్స్ సునీల్ నారంగ్, విజయేందర్ రెడ్డి, రాజ్ తాండ్ల పాల్గొన్నారు.

Next Story

Most Viewed