ఆ ప్రాంత ప్రజలను.. అలెర్ట్ చేయాలి

by  |
ఆ ప్రాంత ప్రజలను.. అలెర్ట్ చేయాలి
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే, వెంటనే స్పందించేలా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్టు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జిల్లాల కలెక్టరేట్‌లతో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలోని కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలలో కూడా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు మంత్రి తెలిపారు. రెండు, మూడ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, పరిస్థితులపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌లు, స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నట్టు మంత్రి తెలిపారు.

ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకల, చెరువుల్లో చేరుతున్న వరద నీటిని అంచనా వేస్తూ, అవసరం అయితే దిగువ ప్రాంతాల ప్రజలను అలెర్ట్ చేయాలని అధికారులకు సూచించారు. రెండు జిల్లాలలో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి అధికారులు, జిల్లా అధికారులు ఎక్కడి వారు అక్కడే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. నగర శివార్లలోని కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలలో, చెరువు పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజల పట్ల జాగ్రత్తగా చూసుకోవాలని, అవసరం అయితే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తరలించాలని అధికారులకు సూచించారు.

పురాతన, శిథిలావస్థకు చేరిన భవనాల్లో ఎవరు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, విద్యుత్, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో పాటు వైద్య అధికారులు అలెర్ట్‌గా ఉండి, వర్షాల కారణంగా తలెత్తే ఇబ్బందులను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. అత్యవసర సమయాల్లో 24 గంటలు పని చేసే కంట్రోల్ రూమ్‌లకు ఫోన్ చేయాలన్నారు. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం‌లో 040-23230813, 23230817, వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో 6305954956 నెంబర్‌లకు అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాలని అన్నారు.

Next Story

Most Viewed