విపక్షాలు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయి: మంత్రి నిరంజన్‌రెడ్డి

by  |
విపక్షాలు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయి: మంత్రి నిరంజన్‌రెడ్డి
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో విపక్షాలు ప్రభుత్వాన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. ప్రభుత్వం చేసిన ఏ మంచి కార్యక్రమాన్ని అయినా బాగుందని ప్రతిపక్షాలు స్వాగతించాయా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, ఆహార భద్రతతో పాటు పోషక భద్రత కల్పించాలన్నదే తమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఆత్మహత్యలను రాజకీయంగా వాడుకోవడం తప్పితే రైతాంగంలో ఆత్మస్థైర్యం నింపే కార్యాచరణను కాంగ్రెస్ చేయలేదని ఆరోపించారు. తెలంగాణ రైతుకున్న చైతన్యం దేశంలో ఎవరికీ ఉండదని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, సమగ్ర వ్యవసాయ విధానాన్ని రైతులు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని పటిష్టం చేసేందుకు కేసీఆర్ మహాయజ్ఞం చేస్తున్నారని పేర్కొన్నారు. 40 రోజులుగా అధికారులు, నిపుణులు, శాస్త్రవేత్తలతో ప్రభుత్వం సుధీర్ఘ చర్చలు జరుపుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మొక్కజొన్న నిల్వలు అధికంగా ఉన్నాయని, అందుకే ఈ సారి మొక్కజొన్న పంట వేయొద్దని ముఖ్యమంత్రి సూచించారని మంత్రి తెలిపారు. నిరంతరం దుమ్మెత్తిపోయడమే విపక్షాల పనా అని ప్రశ్నించిన మంత్రి.. విపక్షాలను సంప్రదించిన తర్వాతే ప్రభుత్వ పథకాలను ప్రారంభించామా, 24 గంటల కరెంట్ ఇచ్చామా అంటూ ప్రశ్నలు సంధించారు.

Next Story

Most Viewed