ఈ నెల 9న కామారెడ్డికి కేటీఆర్.. ఆ రెండిటితోపాటు వారితో కీలక సమావేశం

by  |
KTR-11
X

దిశ, కామారెడ్డి: మంత్రి కేటీఆర్ ఈ నెల 9న కామారెడ్డి జిల్లాకు రానున్నారు. బిబిపేట మండల కేంద్రంలో ప్రముఖ కాంట్రాక్టర్ సుభాష్ రెడ్డి తన సొంత ఖర్చులతో నిర్మిస్తున్న పాఠశాలను మంత్రి ప్రారంభించనున్నారు. పాఠశాల పనులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. పాఠశాల పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధం కావడంతో ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ ను ఆహ్వానించారు. ప్రారంభోత్సవానికి రావడానికి మంత్రి సుముఖత వ్యక్తం చేయడంతో పాఠశాలతోపాటు బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో సుభాష్ రెడ్డి నిర్మిస్తున్న మోడల్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా అదే రోజు మంత్రితో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ రెండు కార్యక్రమాలు పూర్తయిన అనంతరం కామారెడ్డి పట్టణంలోని కర్షక్ బీఈడీ కళాశాల సమీపంలో నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తలతో మంత్రి సమావేశం నిర్వహించనున్నారు. అయితే మంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా రావాల్సి ఉంది. మంత్రి కేటీఆర్ రానుండటంతో స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గురువారం సాయంత్రమే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పాఠశాల పనులను కూడా పరిశీలించారు. మంత్రి కేటీఆర్ తో పాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గొంగిడి సునీత ఈ కార్యక్రమానికి రానున్నారని సమాచారం. అయితే గతంలో మంత్రి హోదాలో కామారెడ్డికి రెండు సార్లు కేటీఆర్ రావాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. ఈసారి మంత్రి వస్తారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.



Next Story