సడన్ ఎంట్రీ ఇచ్చిన కేటీఆర్.. పరుగులు పెట్టిన అధికారులు

by  |
ktr-sircilla-tour -1
X

దిశ, సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ సోమవారం ఆకస్మికంగా పర్యటించారు. మంత్రి రాకతో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అవాక్కయ్యారు. అధికారికంగా ఎలాంటి సమాచారం లేకుండా కేటీఆర్ పర్యటించడంలో ఆంతర్యం ఏమై ఉంటుందని చర్చించుకున్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు దిశ నిర్దేశం చేస్తారన్న విశ్వసనీయ సమాచారంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. నూతనంగా నిర్మితమవుతున్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌తో పాటు జిల్లాలో నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కాలేజ్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్, డబుల్ బెడ్ రూమ్ పనుల పురోగతిని మంత్రి కేటీఆర్ క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాను సందర్శించనున్నారని వెల్లడించారు. అప్పటిలోగా అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి నిర్మాణాలను పూర్తిచేసి సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

మొదటగా నూతనంగా నిర్మితమవుతున్న కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించి దాని ఆవరణలో ప్లాంటేషన్ పనులను త్వరగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్, నర్సింగ్ కాలేజ్‌లను సందర్శించి పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలన్నారు. అలాగే నియోజకవర్గంలో నిర్మితమైన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల చుట్టూ మొక్కలు నాటి పరిసర ప్రాంత వాతావరణాన్ని గ్రీనరీగా మార్చాలన్నారు. అందుకు అనుగుణంగా అవసరమైన మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల చుట్టూ ఎలాంటి అపరిశుభ్రతకు తావులేకుండా పరిసరాల్లోని చెత్తాచెదారాన్ని తొలగించాలన్నారు. చిన్న పిల్లలు ఆడుకునేందుకు వీలుగా పార్కులు ఏర్పాటు చేసి చెట్లు పెంచాలన్నారు. మరింత స్థలం ఉంటే ఆటస్థలంగా వినియోగించాలని సూచించారు. అదేవిధంగా పిల్లల కోసం ప్రత్యేకంగా పాఠశాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కేటీఆర్ స్పష్టం చేశారు.



Next Story

Most Viewed