మెడికల్ హబ్‌గా గ్రేటర్.. ఆ క్రెడిట్ మాదే మీరిచ్చింది గుండు సున్నా..!

by  |
మెడికల్ హబ్‌గా గ్రేటర్.. ఆ క్రెడిట్ మాదే మీరిచ్చింది గుండు సున్నా..!
X

దిశ, బేగంపేట : తెలంగాణ ప్రభుత్వ హయాంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ను మెడికల్ హబ్గా మార్చామని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం సాయంత్రం నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో ఏర్పాటు చేసిన డాక్టర్స్ తెలంగాణ రాష్ట్ర (డాట్స్) సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఆరేళ్ల కాలంలో కేసీఆర్​కిట్ అందజేశామని ఆయన గుర్తు చేశారు. కోటిన్నర మందికి కంటి వెలుగు పరీక్షలు చేసి అర్హులైన వారందరికి కంటి అద్దాలు ఉచితంగా అందజేశామన్నారు. అమ్మ ఒడి వాహనాలు 240 ఏర్పాటు చేశామన్నారు. దీంతో 50శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో నే ప్రసవాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు.354 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశామని, కిడ్నీ సమస్యల తో బాధపడుతున్న వారికి 46 ఉచిత డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. రాష్టంలో 5 మెడికల్ కాలేజీలు ఉంటే రెట్టింపు గా పది చేశామన్నారు. 750 మెడికల్ ఎంబీబీఎస్ సీట్లను 1650 కు తెచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. ఔటర్ రింగ్ రోడ్ లో ప్రమాదాల నివారణకు హెచ్ ఎండీఏ ఆధ్వర్యంలో 10 కిలో మీటర్ల చొప్పున్న పార్మ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్​గుర్తుచేశారు. తెలంగాణలో ప్రతీ పౌరుడికి డిజిటల్ ప్రొఫైల్స్ ఉండాలని ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. ఇందులో భాగంగా పైలెట్ ప్రాజెక్ట్ సిరిసిల్ల నియోజకవర్గంలో కొన సాగిస్తున్నామన్నారు.

కేంద్ర ప్రభుత్వం వాటా గుండు సున్నా..

కేంద్ర ప్రభుత్వం 150 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. అందులో తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కడా కేటాయించక పోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దీని తో పాటు నవోదయ పాఠశాలలు 85 మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి లేకపోవడం బాధాకరమని మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో విరుచుకపడ్డారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయాల్లో కేంద్రం మొండి చేయి చూపిందన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని, ఆరేళ్ల కాలంలో 12 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చారని తీవ్ర స్థాయిలో ప్రధానమంత్రి మోడీపై మండిపడ్డారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ రెట్టింపు స్థాయిలో ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచిందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఇద్దరు అనుభవజ్ఞులైన వీరిని గెలిపించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెలంగాణ డాక్టర్స్ స్టేట్ డాట్స్ చైర్మన్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎంపీ మంద జగన్నాథం, డాక్టర్స్ ప్రతినిధులు భాస్కర్ రావు, జీఎస్ రావు, సుబ్రహ్మణ్యేశ్వర్, రవీందర్ రెడ్డి , లవకుమార్, బొంతు రమేశ్, కిషన్ గౌడ్, జగదీష్ గౌడ్, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed