భక్తులంతా ఓ లింగా అంటుంటే.. ఆ ఇద్దరు మంత్రులు మాత్రం!

by  |
Ministers Jagadish Reddy, Talsani Srinivas
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: యాదవ సంప్రదాయం ప్రకారం పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర అత్యంత వైభవోపేతంగా సాగుతోంది. అర్ధరాత్రి నుంచి భక్తజనం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మూడేండ్లుగా కాళేశ్వరం జలాలతో సూర్యాపేట జిల్లా సస్యశ్యామలం అయ్యిందన్నారు. రైతుల సంతోషం పెద్దగట్టు జాతరలో కన్పిస్తోందన్నారు. యాదవ సోదరులపై సీఎం కేసీఆర్‌కు ఎనలేని ప్రేమ, అభిమానం ఉన్నాయని, ఈ జాతరకు రూ.కోట్లు కేటాయించి అభివృద్ది చేశారని తెలిపారు. జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షల్లో భక్తులు తరలివచ్చారని, సీఎం కేసీఆర్ ఆదేశాలతో జాతరలో సకల సదుపాయాలను కల్పించామని చెప్పారు. భక్తులకు 24 గంటల నిరంతర తాగునీరు, విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు.

peddagattu jathara

దురాజ్‌పల్లి గుట్ట చుట్టుపక్కలా 50 ఎకరాల్లో భక్తులు పార్కింగ్‌కు, వంటలు చేసుకునేందుకు అభివృద్ది చేశామని వివరించారు. మొబైల్ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, కరోనా నేపథ్యంలో శానిటేషన్ పనులకు మొదటి ప్రాధాన్యతనిస్తూ షిఫ్ట్‌ల వారీగా జాతర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని వివరించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. పెద్దగట్టు జాతర వైభవంగా సాగుతోందని, సీఎం కేసీఆర్ పెద్దగట్టును చాలా అభివృద్ది చేశారన్నారు. స్వరాష్ట్రంలో జాతర కన్నులపండువగా సాగుతోందని, కాళేశ్వరం జలాలను పెద్దగట్టుకు తెప్పించినందుకు మంత్రి జగదీష్ రెడ్డికి యాదవులు రుణపడి ఉంటారన్నారు. యాదవుల ఇలవేల్పు లింగమంతుల స్వామిని తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా చేయాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు. మంత్రుల వెంట రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed