ఆలయాలతో భక్తుల్లో ఆధ్యాత్మిక చింతన.. మంత్రి ఇంద్రకరణ్ కీలక వ్యాఖ్యలు

by  |
ఆలయాలతో భక్తుల్లో ఆధ్యాత్మిక చింతన.. మంత్రి ఇంద్రకరణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఆల‌యాల‌తో ఆధ్మాత్మిక చింత‌న ల‌భిస్తుంద‌ని, ఆలయాలకు రావడం వలన భ‌క్తుల్లో ధార్మిక చింతన పెరిగి మానసిక ప్రశాంతత క‌లుగుతుంద‌ని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబం గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీపూర్ క్యాంప్‌లో రూ. 25 ల‌క్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న శ్రీ రామాలయ నిర్మాణానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ఆలయ భూమి పూజ నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల‌తో పాటు పురాతన ఆలయాలకు ప్రభుత్వం నిధులు కేటాయించి వాటికి పూర్వవైభవం తీసుకువస్తోందని అన్నారు. ఉమ్మడి పాల‌న‌లో మ‌న ఆల‌యాలు నిరాదర‌ణ‌కు గుర‌య్యాని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధికి నిధులు కేటాయిస్తున్నార‌ని పేర్కొన్నారు. కేసీఆర్ రూ.12 వంద‌ల కోట్లతో య‌దాద్రి ఆల‌య పున‌ర్నిర్మాణాన్ని తలపెట్టారని, ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రి రూపుదిద్దుకుంటున్నద‌ని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం ఆల‌యాల అభివృద్ధితో పాటు భ‌క్తుల సౌక‌ర్యాల క‌ల్పన‌కు కూడా కృషి చేస్తున్నద‌ని తెలిపారు. ప్రజ‌ల్లో భ‌క్తి భావన పెరిగి ఆల‌యాల‌కు వ‌చ్చే భక్తుల సంఖ్య పెరిగింద‌ని, గ్రామాల్లో ఆల‌య నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని పేర్కొన్నారు. అదేవిధంగా బాన్సువాడ నుండి బాస‌ర జ్ఞాన స‌ర‌స్వతి అమ్మవారి ద‌ర్శనం కోసం కాలిన‌డ‌క‌న‌ వచ్చే భక్తులకు సౌకర్యాలు మెరుగుపరుస్తామ‌ని వెల్లడించారు. గ‌తంలో అర్చకుల‌కు, ఆల‌య సిబ్బందికి స‌రిగ్గా జీతాలు కూడా చెల్లించ‌ని ప‌రిస్థితి ఉండేద‌ని.. తెలంగాణ ప్రభుత్వ హయంలో వారికి ప్రభుత్వ ఉద్యోగుల‌తో స‌మానంగా వేత‌నాల‌ను చెల్లిస్తున్నామ‌న్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను అభివృద్ధి ప‌థంలో న‌డిపించేందుకు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నార‌ని మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. మల్లన్న సాగర్ ద్వారా సింగూర్, నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి నీటిని త‌ర‌లించేలా సీఎం కేసీఆర్‌ను ఒప్పించి ప్రాజెక్ట్‌లో పుష్కలంగా నీరు ఉండేలా పోచారం త‌మ వంతు కృషి చేశార‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.



Next Story