ఆలోపు పనులన్నీ పూర్తి చేయండి.. ఆ తర్వాత ప్రారంభమే : మంత్రి

by  |
Minister Harish Rao
X

దిశ, సిద్దిపేట: దుబ్బాక నియోజవర్గంలో నిర్మాణాలు పూర్తైన డబుల్ బెడ్ రూం ఇళ్ల కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇళ్ల ప్రారంభోత్సవం నాటికే రూ. 3 కోట్ల నిధులతో అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దుబ్బాక పట్టణ 2BHK ఇండ్లను ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. జులై 10వ తేదీలోగా మౌలిక సదుపాయాలు, లబ్దిదారుల ఎంపికతో సహా అన్ని పనులనూ పూర్తి చేసి ప్రారంభోత్సవాలు సిద్ధం చేయాలన్నారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ మీటింగ్‌ హల్‌లో దుబ్బాక నియోజవర్గ డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయమై అధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డిలు సమావేశానికి హాజరయ్యారు. దుబ్బాక నియోజవర్గంలోని దుబ్బాక అర్బన్, రూరల్, మిరుదొడ్డి, తోగుట, దౌల్తాబాద్, రాయిపోల్ మండలాలలోని గ్రామాల వారీగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రెండు పడక గదుల ఇండ్ల ప్రగతిపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… త్వరలోనే పూర్తైన ఇండ్లలో మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు గానూ రూ.3 కోట్లను DMLT నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రగతిలో ఉన్న ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పూర్తైన ఇండ్లకు సంబంధించి తహసీల్దార్‌లు ఈ నెల 13 నుంచి 20 వరకు దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు. దుబ్బాక పట్టణంలో ఈ నెల 13 నుంచి వారంరోజుల పాటు వార్డు ఒక కౌంటర్ ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశించారు. ఇండ్ల ప్రారంభోత్సవానికి వారం ముందే లబ్దిదారుల ఎంపిక పూర్తి కావాలని సూచించారు.

దుబ్బాక నియోజవర్గంలో ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు వచ్చాయన్నారు. ప్రధాన కాలువలు రామాయంపేట, ప్యాకేజ్ 13 కాల్వల నిర్మాణం పూర్తయిoదన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా సుమారు ప్రత్యక్షంగా 1 లక్ష ఎకరాలు,781 చెరువుల ద్వారా సుమారు 50 వేల ఎకరాలకు, మొత్తంగా దుబ్బాక నియోజవర్గంలో కాళేశ్వరం ద్వారా లక్షా 50 వేల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలిగి ఉందని మంత్రి తెలిపారు. సాగునీటి కాలువల నిర్మాణాన్ని రాజకీయాలకతీతంగా సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. అంతేగాకుండా.. కాల్వల భూసేకరణ ప్రాధాన్యతను, భవిష్యత్తులో కాల్వల నిర్మాణం వల్ల జరిగే ప్రయోజనాలను రైతులకు కూలంకషంగా వివరించి, భూములను స్వచ్ఛందంగా రైతులు ప్రభుత్వానికి అప్పగించేలా చైతన్యవంతం చేయాలని మంత్రి తెలిపారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావులు దుబ్బాక నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద మౌలిక సదుపాయాలను త్వరగా పూర్తి చేయాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారు.



Next Story

Most Viewed