ఈటల స్థానాన్ని భర్తీ చేసిన హరీష్ రావు.. అధ్యక్షుడిగా నియామకం

by  |
Minister Harish Rao
X

దిశ, తెలంగాణ బ్యూరో: సుమారు ఎనిమిది దశాబ్దాల చరిత్ర కలిగిన ఎగ్జిబిషన్ సొసైటీకి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇంతకాలం ఆ బాధ్యతలను నాటి ఆర్థికమంత్రి, వైద్యారోగ్య మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ చూశారు. ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో సొసైటీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న ఆ పోస్టుకు హరీశ్‌‌రావును నియమించాలని కార్యవర్గం నిర్ణయం తీసుకున్నది. ఆ ఆఫర్‌కు హరీశ్‌రావు సమ్మతి తెలియజేశారు. మంత్రిని ఆయన నివాసంలో కలిసి విషయాన్ని వివరించిన సొసైటీ ఎగ్జిక్యూటివ్ బాడీకి సానుకూల స్పందన లభించింది.

చారిత్రాత్మకమైన ఈ సొసైటీకి అధ్యక్షుడిగా ఉండాలని ఇచ్చిన ఆహ్వానానికి అనుగుణంగా రానున్న కాలంలో మరింతగా దీన్ని ప్రగతిపథంలోకి తీసుకెళ్ళడానికి తన వంతు కృషి చేస్తానని హరీశ్‌రావు వారికి హామీ ఇచ్చారు. ఈ అవకాశంతో తనపైన బాధ్యత పెరిగిందని, ఇంతకాలం నుమాయిష్‌కు ఉన్న ప్రత్యేక గుర్తింపును ఇకపైన అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళడానికి సమిష్టిగా ప్రయత్నం చేద్దామని వారి సహకారాన్ని కోరారు. సొసైటీ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, వృత్తి నైపుణ్యం మెరుగుపడి ఉపాధి అవకాశాలు పొందేలా చేయడం తన ముందు ఉన్న ప్రధాన కర్తవ్యమని వారికి మంత్రి వివరించారు.



Next Story