మిల్లర్ల మిలాఖత్.. అన్నదాతల నిలువు దోపిడీ

by  |
మిల్లర్ల మిలాఖత్.. అన్నదాతల నిలువు దోపిడీ
X

దిశ, చిట్యాల : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే వేళ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. నారు నాటింది మొదలు చేతికి వచ్చే వరకు పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న రైతున్నకు.. కొనుగోలు వేలా కష్టాలు తప్పడంలేదు. కొనుగోళ్ల కోసం 15 రోజులకుపైగా కేంద్రాల్లో పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది.. తూకం వేసి లారీలో ఎక్కించి రైస్ మిల్లుకు తరలించే వరకు ప్రహసనంలా మారుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 206 కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో 1,25,000 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రతిపాదనలు పెట్టుకున్నారు. కాగా ప్రతీ కొనుగోలు కేంద్రంలో బార్ధన్, తరుగు పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు వాపోతున్నారు. దేశానికే వెన్నెముకగా రైతును భావిస్తారు.. అలాంటిది ఆ రైతును నిలువునా దోపిడీ చేయడం గమనార్హం.

కలెక్టర్ సార్ ఆదేశాలు బేఖాతర్..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యాలయంలో వరిధాన్యం కొనుగోలుపై వ్యవసాయ, మండల ప్రత్యేక అధికారులు, ఇజీఎస్ ఏపీవోలు, వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జీలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ధాన్యం తూకంలో కోతలు విధించరాదని ఆదేశాలను జారీ చేశారు. అయినా సరే కలెక్టర్ సార్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రెండు కిలోల తరుగు తీస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

ప్యాడి క్లినర్‌లో పట్టినా సరే తరుగు..

రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన మొదట ఆరబోస్తున్నారు. అనంతరం ప్యాడి క్లీనర్‌లలో పట్టి ధాన్యాన్ని సంచులలో నింపుతారు. ఇక దీంట్లో తరుగు తీయడానికి ఎలాంటి నిబంధనలు లేవు. ఒకవేళ ధాన్యాన్ని పట్టకుండా తరుగు తీస్తే రైతుకు ఇబ్బంది లేదు. నిబంధనల ప్రకారం ధాన్యాన్ని అన్ని విధాల రెడీ చేసిన రైతుకు తరుగు మాత్రం తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనల కంటే ఎక్కువ తూకం.?

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక బస్తాకు 40.400 తూకం వేయాల్సి ఉంది. కానీ కొనుగోలు కేంద్రాలలో 42.400 తూకం వేస్తున్నారని సమాచారం. ఒకవేళ కొనుగోలు కేంద్రంలో తరుగు తీయకున్నా మిల్లర్లు బస్తాకు 2 కిలోల నుంచి 5 కిలోల తరుగు తీస్తున్నారు. దీంతో రైతు భారీగా నష్టపోవాల్సి వస్తోంది. దీనిపై అధికారులు నిఘా పెట్టి మేలు చేకూరేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

మిల్లుల కొరత.. కేంద్రాల్లోనే ధాన్యం..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా రైతు రైస్ మిల్లుల కొరత ఉంది. దీంతో అధికారులు పక్క జిల్లాలోని మిల్లులకు ధాన్యాన్ని కేటాయిస్తున్నారు. దీనివల్ల రైతు సరుకు సకాలంలో మిల్లులకు చేరకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒకవేళ వర్షం కురిస్తే రైతులనే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు బాధ్యులను చేస్తున్నారు. మరోవైపు రోజుల తరబడి లారీలు మిల్లుల వద్ద క్యూలైన్లో దర్శనమిస్తున్నాయి.

జాడలేని అధికారులు.

కొనుగోలు కేంద్రాల్లో మొదట తనిఖీలు చేపట్టిన అధికారులు.. ప్రస్తుతం పట్టించుకోకపోవడంతో సొసైటీలు, రైస్ మిల్లర్లు రాజ్యమేలుతున్నారు. రైతును అందినకాడికి దోచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో అత్యంత కీలకమైన చిట్యాల, టేకుమట్ల, రేగొండ, మొగుల్లపల్లి మండలంలోని రైతులు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సీరియల్ ప్రకారం వచ్చినప్పటికీ రికమెండేషన్, సొసైటీ సిబ్బందితో మచ్చికగా ఉన్న వారి ధాన్యాన్నే ముందుగా తరలిస్తున్నారు. ఇదేంటని రైతులు ప్రశ్నిస్తే మీ ధాన్యంలో తేమ ఎక్కువగా ఉంది.. ఇంకా ఆరబెట్టాలని చెబుతున్నారు. ఈ క్రమంలో వర్షం వస్తే ధాన్యం తడిసి ముద్ద కావాల్సిందే. తాడిపత్రిలు రైతులే తెచ్చుకోవాలి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed