రాజకీయాల్లో ప్రభుత్వం.. మోసాల్లో మిల్లర్లు

by  |
Millers business
X

దిశ, తెలంగాణ బ్యూరో : అధికార, ప్రతిపక్ష పార్టీలో వరి రాజకీయాల్లో కొట్టుకుంటున్నాయి. కేంద్రంపై నెపంతో రాష్ట్రం రోజుకో తీరుతో విరుచుకుపడుతోంది. అటు కేంద్రంలో అధికార పార్టీ మేం చేస్తున్నదే కరెక్ట్​ అంటూ చేతులెత్తేస్తోంది. ఇదే సమయంలో వానాకాలం కొనుగోళ్లలో రైతులను నిండా ముంచుతున్నారు. సర్కారు రాజకీయాల్లో బిజీ ఉంటే కొనుగోలు కేంద్రాల్లో మాత్రం రైతులను కొల్లగొట్టడమే ధ్యేయంగా నిర్వాహకులు, మిల్లర్లు వ్యాపారం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల్లో రైతులు దగా పడుతున్నారు. అన్నదాతల నుంచి ధాన్యాన్ని కొల్లగొడుతున్నారు.

ఒక్కో సంచికి 40 కిలోల వడ్లు తూకం వేయాల్సి ఉండగా.. తాలు, తేమ అంటూ దోపిడీ చేస్తున్నారు. ధాన్యం నాణ్యంగా లేదని, తాము మిల్లింగ్‌ చేయలేమని తిరస్కరిస్తూ మిల్లర్లు మెలిక పెడుతున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులను తీసుకెళ్లి.. మిల్లర్లతో మాట్లాడించి.. తాము అమ్మిన ధాన్యాన్ని తక్కువ తూకం వేసేలా ఒప్పందం కుదురుస్తున్నారు. తమ దగ్గరకు వచ్చిన రైతులను మిల్లర్లు అక్కడికక్కడే నిలువు దోపిడీ చేస్తున్నారు. తేమ ఎక్కువ ఉందని, బియ్యం పట్టిస్తే నూక వస్తుందంటూ ఒక్కో సంచిపై 5 కిలోల తరుగు తీస్తున్నారు. ఈ వ్యవహారంలో రైస్‌ మిల్లు యజమానులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు భాగస్వామ్యం ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి.

కొన్ని చోట్ల కొనుగోలు చేసిన ధాన్యానికి నగదు చెల్లింపులు ఆలస్యమవుతుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పంట పెట్టుబడికి ప్రైవేటు అప్పులు చేయడంతో రోజురోజుకూ వడ్డీలు పెరుగుతున్నాయే తప్ప విక్రయించిన ధాన్యానికి సంబంధించిన నగదు చేతికి రావడం లేదు. ధాన్యం కొనుగోళ్లలో కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో దళారులు, మిల్లర్ల అక్రమాలు కొనసాగుతున్నాయి. చాలా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంలో తేమ, మట్టి పెళ్లలు, తాలు ఉందన్న నెపంతో తూకంలో కోత విధిస్తున్నారు.

మిల్లర్లదే రాజ్యం

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. ఒక్క కేంద్రంలో కనీసం 20 రోజుల పాటు నిల్వ చేస్తున్నారు. అష్టకష్టాలు పడి ధాన్యాన్ని మిల్లులకు తీసుకెళ్తే అక్కడ మిల్లర్ల దయాదాక్షిణ్యంపై అన్‌లోడ్‌ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మిల్లర్లు వద్దంటే ఆ ధాన్యం లోడ్‌ ఏం చేయాలి? ఎక్కడకు తీసుకెళ్లాలో తెలియక రైతులు అయోమయానికి గురవుతున్నారు. ధాన్యం బస్తాలు అన్‌లోడ్‌ చేయాలంటే వారు చెప్పిన విధంగా కోత విధించేందుకు ఒప్పుకుంటేనే ఓకే చెబుతున్నారు. ఇలా ఒక్కో లారీకి 20 నుంచి 35 క్వింటాళ్ల వరకు కోత విధిస్తూ, రూ.80 వేల వరకు అదనంగా లాభం గడిస్తున్నారు. ఒక్కో క్వింటాలుకు 5 కిలోల తరుగు తీయడంపై రైతులు నిలదీస్తున్నా నిర్లక్ష్య సమాధానమే వస్తోంది.

మిల్లర్ల దోపిడీకి సాక్ష్యం ఇదిగో..

కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తరలించిన ధాన్యం బాగాలేదని మిల్లర్లు ఇష్టం వచ్చినట్లుగా తరుగు తీస్తున్నారు. క్వింటాలుకు ఐదు కిలోల వరకు తరుగు తీస్తున్నారు. కొనుగోలు కేంద్రం తూకం చేసిన వివరాలు, మిల్లులో రాసుకుంటున్న లెక్కలకు పొంతన కుదరడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో అన్నీ సరిచూసుకుని, తూకం వేసి పంపిన ధాన్యాన్ని మిల్లర్లు తిరస్కరించడం రైతులకు మరో సమస్యగా మారింది. తేమ శాతాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే నిర్ధారించాకే మిల్లులకు పంపుతున్నారు. అయితే నమూనా మిల్లింగ్ లో నూకలు ఎక్కువ వస్తున్నాయంటూ మిల్లర్లు ఆ ధాన్యాన్ని తిరస్కరిస్తున్నారు. తరుగు తీసేందుకు అంగీకరిస్తేనే తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి.

తరుగు పేరుతో క్వింటాకు 10 కిలోల ధాన్యం తీస్తున్న మిల్లర్ల తీరును నిరసిస్తూ ఇటీవల వనపర్తి జిల్లా పెద్దమందడిలో రైతులు ధాన్యాన్ని రహదారి పై పోసి నిప్పంటించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో రైతులు క్రిమిసంహారక మందుతో నీళ్ల ట్యాంకు ఎక్కి ఆందోళన చేశారు. మిల్లు యజమానులు తరుగు, తేమ పేరుతో కొర్రీలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల భువనగిరి-యాదాద్రి జిల్లాలోనూ రైతు ఆందోళన చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకంపల్లి గ్రామంలో భారీ తరుగు ఇవ్వలేక మూడు లారీల ధాన్యాన్ని వెనక్కి తెచ్చుకున్నారు.

కర్షకుల బాధలు వర్ణనాతీతం

పండించింది మొదలు అమ్ముకోవడం వరకు రైతుల బాధలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. కేంద్రాల్లో 20 రోజులకు పైగా వేచి ఉంటే కానీ కొనుగోలు వంతు వచ్చే పరిస్థితి లేదు. ఈలోగా వర్షం కురిస్తే ఆ రైతుల పరిస్థితి పర్ణనాతీతం. తడిసిన ధాన్యాన్ని మళ్లీ ఆరబెట్టిన తరువాత కానీ తూకానికి రావటం లేదు. అధికారులు తేమ శాతాన్ని నిర్ధారించి తీసుకున్న వడ్లను కూడా నమూనా మిల్లింగ్ పేరుతో మిల్లర్లు నిరాకరిస్తున్నారు. అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. తరుగు ఇవ్వలేక, వెనక్కు తెచ్చుకుని మళ్లీ ఆరబెట్టలేక రైతులు అవస్థలు పడుతున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed