మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

by  |
మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: మైక్రోమ్యాక్స్ దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దిగ్గజ కంపెనీలకు పోటీ ఇచ్చిన బ్రాండ్. తక్కువ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో ఒకప్పుడు టాప్ పొజిషన్‌లో ఉన్న ఈ బ్రాండ్ ఆ తర్వాత చైనా కంపెనీల ధాటికి స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో కొనసాగించలేకపోయింది. శాంసంగ్, రియల్‌మీ, ఒప్పో, షావోమీ, వీవో బ్రాండ్‌ల దూకుడును తట్టుకోలేక కనుమరుగైన ఈ మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ మళ్లీ మార్కెట్లోకి వస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలోనే మైక్రోమ్యాక్స్ మళ్లీ ఆ బ్రాండ్‌లను ఢీకొట్టేందుకు సిద్ధమైంది.

ఈ ఏడాది కరోనా వ్యాప్తితో పాటు, దేశీయంగా సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత్‌లో చైనా వ్యతిరేకత కొనసాగుతోంది. గత కొన్నేళ్లుగా భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై ఆధిపత్యం కొనసాగిస్తున్న చైనా కంపెనీల స్థానంలో దేశీ బ్రాండ్ సెంటిమెంట్‌తో మళ్లీ మార్కెట్లో కొనసాగేందుకు మైక్రోమ్యాక్స్ ప్రణాళిక సిద్ధం చేసుకుంది.

‘మేడ్ ఇన్ ఇండియా’ ట్యాగ్‌తో భారత స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలోకి రీ-ఎంట్రీ ఇస్తున్న మైక్రోమ్యాక్స్ సరికొత్తగా మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్1, మైక్రోమ్యాక్స్ ఇన్ 1బీ మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇన్ నోట్1 బేసిక్ స్మార్ట్‌ఫోన్‌గా వస్తుంటే, ఇన్ 1బీ మోడల్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌గా పరిచయమవుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మైక్రోమ్యాక్స్ అధికారిక స్టోర్‌లో నవంబర్ 26 నుంచి విక్రయించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. కాగా, మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 ధర రూ. 10,999, మైక్రోమ్యాక్స్ ఇన్ 1బీ ధర రూ. 6,999 నుంచి లభించనున్నట్టు కంపెనీ వెల్లడించింది.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల స్థాయిలో ఈ రెండు స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను వినియోగదారులకు పరిచయం చేస్తున్నామని, ఇతర బ్రాండ్‌లకు ధీటైన పోటీ ఇస్తాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే, ఈ ఫోన్‌లు స్టాక్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు. వీటిలో గూగుల్ యాప్స్ మినహా మరే ఇతర యాప్స్ ఉండవు. అంతేకాకుండా రెండేళ్ల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ లభిస్తాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 మోడల్ మీడియా టెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని, 48 మెగాపిక్సల్ క్వాడ్ కెమెరా, 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి సరికొత్త ప్రత్యేకతలతో తీసుకొస్తున్నట్టు మైక్రోమ్న్యాక్స్ సహ-వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ చెప్పారు. అదేవిధంగా మైక్రోమ్యాక్స్ ఇన్ 1బీ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌తో, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రత్యేకతలున్నాయని, రియర్ కెమెరా 13 మెగాపిక్సల్, ఫ్రంట్ కెమరా 8 మెగా పిక్సల్‌తో లభిస్తుందని ఆయన తెలిపారు.


Next Story

Most Viewed