మాస్కులు కరోనాని అడ్డుకుంటాయా?

by  |
మాస్కులు కరోనాని అడ్డుకుంటాయా?
X

దిశ, వెబ్‌డెస్క్:
కోవిడ్ 19 వైరస్ హైదరాబాద్‌కి వచ్చేసిందని జనాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. దీంతో ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి బయటికి వస్తున్నారు. అయితే ఈ మాస్కులు నిజంగా కరోనాను అడ్డుకుంటాయా? మాస్కులు ఎలా ధరించాలి? అనే విషయాల్లో చాలా మందికి అవగాహన లేదు.

గాలిలో ఉన్న కాలుష్య కణాలు పొల్యూషన్ మాస్కులు ఫిల్టర్ చేస్తాయి. అయితే అన్ని రకాల పార్టికిల్స్‌ని ఇవి ఫిల్టర్ చేయలేవు. ముఖ్యంగా అతి చిన్నగా ఉండే పార్టికిల్స్‌ని మాస్కులు అడ్డుకోలేవు. మాస్కులు కేవలం పీఎం2.5 పార్టికిల్స్, దుమ్ము, ధూళి, బాక్టీరియా, జలుబు కలిగించే వైరస్‌లను అడ్డుకుంటాయి. ఎంత మంచి ధర కలిగిన మాస్క్ అయినా సరే 80 నుంచి 95 శాతం కాలుష్య కణాలను మాత్రమే అడ్డుకోగలదు. యాంటీ పొల్యూషన్ మాస్కుల్లో వాటి ఫిల్టరింగ్ సామర్థ్యాల ఆధారంగా వివిధ రకాలు ఉంటాయి. వీటిని బ్యూరో ఆఫ్ ఇండియా సేఫ్టీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్, గోబియావో స్టాండర్డ్స్ వారు సర్టిఫై చేస్తారు. ఎన్95, ఎన్99 అని మాస్కులను కేటగిరీ చేస్తారు. ఇక్కడ 99, 95 అనేవి ఆయా మాస్కుల ఫిల్టరింగ్ సామర్థ్యం.

మాస్కులు ధరించడం వల్ల నిజంగా లాభమా?

దీనికి సమాధానం చెప్పడం చాలా కష్టం. ఇది మాస్కు ధరించే విధానం, తిరిగే ప్రదేశాలను బట్టి ఉంటుంది. నిజానికి మాస్కులు ధరించినవారే అతి నమ్మకంతో ఎక్కువ ప్రదేశాలు తిరగడం వల్ల కాలుష్య కణాల బారిన పడే అవకాశాలు పెరుగుతున్నాయని ఓ సర్వేలో తేలింది. అంతేకాకుండా మాస్కు ధరించేటపుడు చేతులు కడుక్కోకుండా, మాస్కుకి చెంపలకి మధ్య ఖాళీ స్థలం ఉండేలా ధరించడం వల్ల కూడా మాస్కుల సామర్థ్యం తగ్గిపోతుంది. అలాగే ఒకే మాస్కుని ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే మాస్కులు ధరించని వారితో పోలిస్తే ధరించిన వారిలో రక్తపీడనం, హృదయ స్పందన రేటు కాస్త మెరుగ్గా ఉన్నట్లు బీజింగ్ శాస్త్రవేత్తలు గతంలో నిరూపించారు. ఏదేమైనా కోవిడ్ 19 లాంటి వైరస్‌ను మాస్కుల ద్వారా అడ్డుకోవాలని ప్రయత్నించడం కంటే వీలైనంత మేరకు బయట తిరగకుండా ఉండటమే మంచిది.

Tags: COVID 19, Corona, Pollution Masks, Blood Pressure, Cold, Cough, Hyderabad, Corona case, Health Issue



Next Story

Most Viewed