సగానికి పడిపోయిన మారుతీ అమ్మకాలు!

by  |
సగానికి పడిపోయిన మారుతీ అమ్మకాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సంస్థ అమ్మకాలు దారుణంగా క్షీణించాయి. మార్చి నెలలో ఏకంగా 47 శాతం అమ్మకాలు తగ్గాయని కంపెనీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో కార్ల అమ్మకాలపై ప్రభావాం చూపించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా గతేడాది అమ్మకాలతో ఈ ఏడాది మార్చి నెల అమ్మకాలను పోల్చలేమని సంస్థ బుధవారం పేర్కొంది.

కరోనా దెబ్బకు మారుతీ సుజుకీ కంపెనీ కేవలం 76,976 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. గతేడాది ఇదే సమయంలో 1,47,613 యూనిట్లను విక్రయించింది. ఇక, మారుతీ సంస్థ పాపులర్ మోడల్ అయిన స్విఫ్ట్, బలెనో, వాగన్ ఆర్ మోడల్ కార్ల విక్రయాలు ఏకంగా 51 శాతం పడిపోయాయి. మినీ కేటగిరిలో ఉన్న ఆల్టో, ఎస్‌ప్రెస్సో విక్రయాలు సైతం 5 శాతం క్షీణించి 15,988 యూనిట్లకు పడిపోయాయి. ఇవి కాకుండా…విటారా బ్రెజా, ఎస్-క్రాస్, ఎక్స్ఎల్ 6 విక్రయాలు 53 శాతం తగ్గి 11,904 యూనిట్లకు పడిపోయాయి. మిడ్ రేంజ్‌లో సియజ్ అమ్మకాలు కూడా గతేడాది కంటే సగానికి తగ్గి 1,863 యూనిట్లను నమోదు చేశాయి.

ఇక మార్చి నెలకు ఎగుమతులు 55 శాతం క్షీణించి 4,712 యూనిట్లు నమోదయ్యాయి. అయితే, 2020 ఆర్థిక సంవత్సరానికి దేశీయ మార్కెట్లో 18 శాతం తగ్గి 14,36,124 యూనిట్ల విక్రయాలు జరిగినట్టు మారుతీ సుజుకీ సంస్థ ప్రకటించింది. ఎగుమతులతో కలిపి మొత్తం విక్రయాలు 15,63,297 యూనిట్లు అని, ఇంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 16 శాతం తగ్గి 18,62,449 యూనిట్లని సంస్థ వెల్లడించింది.

2019 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక మందగమనం కారణంగా బలహీన డిమాండ్ వల్ల విక్రయాల్లో తగ్గుదల ఉందని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఉద్గార నిబంధనల వల్ల వాహనాలను బీఎస్-6కు అప్‌గ్రేడ్ చేయాల్సి రావడం, మూలధన కొరత వంటి ఇతర సమస్యలతో మొత్తం ఆటో పరిశ్రమకే అతిపెద్ద సవాళ్లు ఎదురయ్యాయని వాటిన్నటిని అధిగమించి త్వరలో గాడిలోకి వస్తామని సంస్థ పేర్కొంది.

Tags: Coronavirus, Coronavirus Pandemic, Maruti Suzuki, Maruti Suzuki Sales, BS VI Emission Norms, Maruti Suzuki BS VI Vehicles


Next Story

Most Viewed