కార్లు హోమ్ డెలివరీ చేయబడును!

by  |
కార్లు హోమ్ డెలివరీ చేయబడును!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో సుధీర్ఘ లాక్‌డౌన్ తర్వాత దేశంలోని దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా కార్యకలాపాలను బుధవారం తిరిగి ప్రారంభించింది. సుమారు 600 డీలర్‌షిప్‌లను తెరిచినట్లు సంస్థ వెల్లడించింది. అలాగే, వాహనాల డెలివరీలను మొదలుపెట్టింది. ప్లాంట్ల కార్యకలాపాలు ప్రస్తుతానికి ఇంకా ప్రారంభించలేదని, అయినప్పటికీ డెలివరీలు చేయడానికి సరపడా స్టాక్ తమ వద్ద ఉందని ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా వాహనాల కొనుగోలుకు సమగ్ర ప్రామాణిక విధానాన్ని ఏర్పాటు చేశామని, డిజిటల్ సదుపాయాలను మరింత పటిష్టం చేస్తామని సంస్థ పేర్కొంది. దేశంలోని 600 డీలర్‌షిప్‌లను తెరిచినట్టు, ఇదివరకే 55 యూనిట్లతో కార్ల డెలివరీలను ప్రారంభించినట్టు మారుతీ సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మార్కెటింగ్ అండ్ సేల్స్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఆంక్షల సడలింపు అనుమతులు తప్పనిసరి అవసరమై రాష్ట్రాల్లోని డీలర్లు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆయన వివరించారు.

పూర్తి భద్రత, పరిశుభ్రత, శానిటైజేషన్ విధానాలను ఖచ్చితంగా అమలు చేస్తున్నామని, కొనుగోలు సమయంలో షోరూమ్‌లను సందర్శించేందుకు వినియోగదారులకు సహాయంగా డిజిటల్ ప్రక్రియను సంస్థ ఏర్పాటు చేసిందని సంస్థ సీఎమ్‌డీ కెనిచి వివరించారు. కార్ల డెలివరీ కోసం షోరూమ్‌లకు రాకుండా ఇంటికే పంపేందుకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. అలాగే, డీలర్‌షిప్‌లు టెస్ట్ డ్రైవ్ వాహనాలను పూర్తిగా స్టెరిలైజేషన్ చేపడతామని అన్నారు. లాక్‌డౌన్ ఆంక్షలు ఉండటంతో మారుతీ సుజుకి ఏప్రిల్‌లో ఒక్క కారును కూడా విక్రయించలేకపోయింది.

Tags: Maruti Suzuki india, showrooms re-opened, cars home delivery, lockdown impact, coronavirus

Next Story

Most Viewed