October-5World Teachers' Day.. జ్ఞాన వితరణశీలి గురువు

by Disha Web Desk 6 |
October-5World Teachers Day.. జ్ఞాన వితరణశీలి గురువు
X

బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపాలన్నీ సమ్మిళితమై గురువుగా ఇలలో వెలసి మన ముందు నిస్వార్థ మార్గదర్శకులుగా ఉన్న సంగతి మనందరికీ తెలుసు. నడిచే పరబ్రహ్మగా ఉపాధ్యాయులు రాబోయే విశ్వ తరాలను నిర్మించే మహాయజ్ఞంలో తమ గురుతర బాధ్యతలను విస్మరించక, తమ జీవితాశయాలుగా మలుచుకొని సమాజ దశ దిశలకు బాటలు వేస్తున్నారు. ప్రపంచంలో గురువులేని వ్యక్తి ఉండరు. నిరక్షరాస్యుడి జీవితంలో కూడా తను నమ్మిన గురువు చూపిన మార్గంలో అడుగులు వేస్తారు. నేటి బాలలను రేపటి బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దే నిస్వార్థ జీవులే గురువులు. అన్ని వృత్తులలోకెల్ల ఉపాధ్యాయవృత్తి అత్యంత గౌరవం కలిగినదిగా పేర్కొంటున్నారు. యువత సన్మార్గంలో నడవడానికి పునాదులు వేసే బాధ్యత తల్లితండ్రుల తరువాత ఉపాధ్యాయుడి మీదనే అధికంగా ఉంటుంది. అమ్మ, నాన్న తరువాత మూడో తల్లితండ్రిగా గురువును అభివర్ణిస్తారు.

ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం-2023 నినాదం

విశ్వవ్యాప్తంగా ఉపాధ్యాయుల పాత్రను అభినందించడం, కృతజ్ఞతలను తెలియజేయడం, స్మరించుకోవడం మరిచిపోరాదని ‘ఐరాస’ (ఐక్యరాజ్యసమితి)లోని అతిముఖ్య విద్యా శాఖ యునెస్కో (యునైటెడ్‌ నేషన్స్ ఎడ్యుకేషనల్‌, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌) 05 అక్టోబర్‌ 1966న తీసుకున్న నిర్ణయం ప్రకారం, 1994 నుండి ప్రతియేటా అక్టోబర్‌ 05 న “ప్రపంచ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం” పాటించడం జరుగుతుంది. శిశు తరగతి నుండి ఉన్నత విద్య వరకు అధ్యాపకుడి భూమిక ప్రతి దశలో ఉంటుంది. “ప్రపంచ ఉపాధ్యాయ దినం-2023” నినాదంగా “ఉపాధ్యాయులే జ్ఞాన వితరణశీలురు - ఉపాధ్యాయుల కొరతను తగ్గిద్దాం” తీసుకొని, ఉపాద్యాయుల బోధనాపద్ధతిలో వచ్చిన ఆధునిక అనివార్య మార్పులను సవాలుగా తీసుకొని చక్కని‌ బోధనలు చేయడానికి సన్నద్దం అవుతున్నారు. కొన్ని సందర్భాలలో తల్లితండ్రులు చెప్పే విషయాలను కూడా నమ్మని పిల్లలు గురువుల బోధనలను తూచాతప్పక గుడ్డిగా నమ్మతారనేది వాస్తవం.

ఆధునిక బోధనా పద్ధతుల ఆకళింపు

అంతర్జాతీయ స్థాయి విషయ పరిజ్ఞానాన్ని స్వంతం చేసుకొని, ఆధునిక బోధనా పద్దతులను ఆకళింపు చేసుకొని, పిల్లల మానసిక స్థితిని పసిగడుతూ ఆకర్షణీయ బోధన చేసే విధంగా శిక్షణ తీసుకోవడం లాంటివి ఉపాధ్యాయుల కనీస అవసరాలుగా ప్రపంచదేశాలు భావిస్తున్నాయి. యువతలో విద్యాప్రమాణాలు పెరగాలన్నా, నాణ్యమైన బోధనలు జరగాలన్నా ఉపాధ్యాయులకు ఉన్నత స్థాయి శిక్షణలు తప్పనిసరియని దేశాలన్నీ గుర్తించాయి. స్థానిక విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించడంతో మాత్రమే మన రేపటి యువత అంతర్జాతీయ వేదికల్లో రాణించగలుగుతారు. మారుతున్న జీవనశైలి, వెల్లువెత్తుతున్న శాస్త్రసాంకేతికత, విశ్వమే కుగ్రామం అయిన రోజులు, కరోనా విజృంభనతో విద్యాలయాలు మూతపడడంలాంటి పెను సవాళ్ళ మధ్య విద్యాబోధన ప్రక్రియ ప్రమాదంలో పడుతున్నది. వైజ్ఞానిక విప్లవ విస్పొటనానికి అనుగుణంగా ఉపాధ్యాయులు నవీన కొత్త పోకడలను అవగాహన చేసుకొని, తరగతి గదిని ఆటపాటల వేదికగా, ఆసక్తికర బోధనా పద్దతులను ఆశ్రయించాల్సి ఉన్నది. విపత్తు నిర్భంధనల నడుమ ఆన్‌లైన్ ఆఫ్‌లైన్‌‌ బోధనలకు అలవాటు పడుతూ, విద్యార్థులను ఆకర్షించాల్సిన బాధ్యత గురువుల మీదనే ఉంది.

జీవిత పాఠాల బోధనలు

ఉపాధ్యాయులు నిర్వహించే పలు బాధ్యతలలో ఒకటి పాఠ్యాంశాల బోధన మాత్రమే కాదు. దీనికి తోడుగా గురువు మంచి స్నేహితుడిగా, మూడో తల్లితండ్రిగా, మేధావిగా, మార్గదర్శిగా, ప్రేరకుడుగా, తప్పడుగులను సవరించే హితుడిగా, సరైన జీవనశైలిని నేర్పే అన్నగా, ఆటపాటల్లో తమ్ముడిగా, పరిపాలనాదక్షుడిగా, సన్మార్గాన్ని చూపే ఆదర్శమూర్తిగా, మంచి సలహాదారుగా, జీవనతత్వాన్ని రుచిచూపే తత్వవేత్తగా అనేక పాత్రలను ఏకకాలంలో నిర్వర్తించాలి. సుఖ జీవనానికి తగు జీతాన్ని, జీవించే కళను నేర్పడమే ఉపాధ్యాయుల బాధ్యత అని అర్థం చేసుకోవాలి. సమాజానికి డాక్టర్‌, యాక్టర్‌, లాయర్‌, ఇంజనీర్‌, రాజకీయ నాయకుడు, వ్యాపారి, ఆదర్శ ఉద్యోగి, కలెక్టర్‌, పోలీస్‌ లాంటి అన్ని వృత్తుల వారిని తయారు చేసే మేధో వితరణ మనోబల యంత్రమే ఉపాధ్యాయుడని మనకు తెలుసు.

ఉపాధ్యాయుల ఉన్నత లక్షణాలు

తరగతి గదిలో పాఠ్యాంశాలను బోధించే వారు సాధారణ ఉపాధ్యాయులుగా, స్పష్టతతో వివరించే వారు మంచి ఉపాధ్యాయులుగా, నేర్చుకుంటూ ఎదగాలనే ప్రేరణ కలిగించే వారు ఉత్తమ ఉపాధ్యాయులుగా సమాజంలో పేరు తెచ్చుకుంటారు. విద్యార్థుల్లో నిగూఢంగా దాగివున్న అభిరుచులు, ఆసక్తులను సున్నితంగా విశ్లేషించి, వారి ఎదుగుదలకు నిచ్చెనలా నిలబడగలిగిన వ్యక్తి గురువు ఒక్కరే. ఉపాధ్యాయుడిలో క్రమశిక్షణ, జ్ఞాన సంపన్నత, మార్గనిర్థేశనం, నిర్వాహకయుక్తి, అంకితభావం, కరుణ, బోధనాభిరుచి, అవగాహనా సామర్థ్యం, ఓపిక, ఆదర్శంగా నిలవడం, నియంత్రణాశక్తి, శ్రమించే తత్వం, సంభాషణా చాతుర్యం, జ్ఞాన వితరణలో ఆసక్తి లాంటి ఉన్నత లక్షణాలు ఉండడం తప్పనిసరి అని గురువు నమ్ముతాడు. సమాజానికి వెన్నుముకగా నిలబడగలిగిన వారే గురుబ్రహ్మలు. దేశ ఆర్థిక సామాజిక నైతిక అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిది. వనరుల కేంద్రం, కనిపించే ధైర్యం, నడిసొచ్చే దైవం, నైపుణ్య కొండ, వ్యక్తిత్వ వికాస అండ, విజ్ఞాన నిధి, శ్రేయస్సును కోరే పెన్నిధి, అనంత విశ్వాసాల సన్నిధిగా గురువు బహుముఖ పాత్రలలో ఒదిగి, సమాజ ఎదుగుదలకు ఉత్ప్రేరకంగా నిలిచే నిస్వార్థజీవి ఉపాధ్యాయుడు మాత్రమే. ఉపాధ్యాయులు వృత్తిలో అలసత్వం వహిస్తే, రాబోయే తరాల పునాదులు కదిలి, బలహీనపడి, సమాజం అల్లకల్లోలం అవుతుందని మరువరాదు. నేటి ఆధునిక వేగవంతమైన డిజిటల్‌ ప్రపంచంలో ఉపాధ్యాయులు తమ విధులను విస్మరించక, విలువల బీజాలను లేత మనస్సుల్లో నాటి, మేధో మహా వృక్షాలుగా ఎదిగేలా సాధన చేసి, విశ్వశాంతికి, నవ్య ప్రగతికి బాటలు వేయాలని ఆశిద్దాం.

డా బుర్ర మధుసూదన్ రెడ్డి

కరీంనగర్‌ - 99497 00037



Next Story