మరాఠ రిజర్వేషన్లు రద్దు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

by  |
supreme court
X

న్యూఢిల్లీ : మహారాష్ట్రలో ప్రభావిత శక్తిగా ఉన్న మరాఠాలకు కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. అవి రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది. విద్యా, ఉద్యోగాల్లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2018లో తీసుకొచ్చిన చట్టాన్ని కొట్టివేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దన్న ఇందిరా సాహ్నీ తీర్పును పున:సమీక్ష చేయవలసిన అవసరం లేదని ఈ సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది. ఇదిలాఉండగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై మరాఠాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రమంతటా కొవిడ్ నిబంధనలు అమల్లోఉన్నా.. రోడ్లమీదకు వచ్చి నిరసనలకు దిగారు. కోర్టు తీర్పు దురదుష్టమకరమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే తెలపగా.. ఇది మహా వికాస్ అగాఢీ (ఎంవీఎ) ప్రభుత్వ వైఫల్యమని బీజేపీ ఆరోపించింది.

కేసు పూర్వాపరాలు..

మరాఠాలకు విద్యా, ఉద్యోగాలలో 16 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ 2018లో అప్పటి బీజేపీ, శివసేనలతో కూడిన ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ బాంబే హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. రిజర్వేషన్లను సమర్థిస్తూనే వాటిని విద్యా ప్రవేశాల్లో 12 శాతానికి, ఉద్యోగాల్లో 13 శాతానికి తగ్గించాలని తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, విచారణ సందర్భంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని చారిత్రాత్మక తీర్పునిచ్చిన ఇందిరా సాహ్నీ (1992లో వెలువడిన ఈ తీర్పును మండల్ కమిషన్ తీర్పు అని కూడా పేర్కొంటారు) తీర్పును పున:సమీక్ష చేయవలసిన అవసరం ఉందా అని కూడా ఒక సందర్భంలో ప్రశ్నించింది.

ఆ హక్కు మీకు లేదు : సుప్రీం

ఇదిలా ఉండగా.. మరాఠా రిజర్వేషన్లపై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం స్పందిస్తూ.. ఆర్థిక వెనుకబాటు కారణంగా మరాఠాలకు రిజర్వేషన్ కల్పించారని అభిప్రాయపడింది. ఒక వర్గాన్ని సామాజికంగా, ఆర్థికంగా బ్యాక్‌వర్డ్ జాబితాలో చేర్చే హక్కు రాష్ట్రాలకు లేదని తెలిపింది. వాటిని గుర్తించి కేంద్రానికి సిఫారసు చేస్తే రాష్ట్రపతి వాటిని వెనుకబడిన వర్గాల జాబితాలో చేర్చుతారని సూచించింది. అంతేగాక ఇందిరా సాహ్నీ తీర్పును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన పనిలేదని కోర్టు స్పష్టం చేసింది. దానిని అతిక్రమించడమంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15లను ఉల్లంఘించినట్టేనని పేర్కొంది. 50 శాతం నిబంధనను దాటి మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడానికి అసాధారణ కారణాలేవీ లేవని సుప్రీం ధర్మాసనం వివరించింది. అసాధారణ, అనివార్య పరిస్థితులతో ఈ నిబంధనను కొద్దిమేరకు సడలించే అవకాశముంటుందని.. కానీ మరాఠాలు అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారని గైక్వాడ్ కమిషన్ వివరించలేదని తెలిపింది.

దురదృష్టకరం : ఉద్దవ్ థాక్రే

మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు దురదృష్టకరమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే అన్నారు. కోర్టు తీర్పు వెల్లడైన తర్వాత ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ.. ఈ విషయంలో ప్రధాని మోడీ, రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కోరారు. ‘చేతులెత్తి వేడుకుంటున్నాను. దీనిమీద తక్షణమే నిర్ణయం తీసుకోండి. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాఖ్ విషయంలో రాజ్యాంగ సవరణలు చేసినట్టు ఈ రిజర్వేషన్ల అంశం మీదా అవసరమైన సవరణలు చేయండి..’ అంటూ ప్రధాని మోడీని అభ్యర్థించారు. కాగా, ఇది ఎంవీఎ ప్రభుత్వ వైఫల్యమే అని బీజేపీ మండిపడింది. రిజర్వేషన్ల విషయంలో కోర్టును మెప్పించడంలో ఎంవీఎ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆరోపించింది.



Next Story

Most Viewed