విప్లవ జోహార్లు.. ముగిసిన సందే గంగయ్య అంత్యక్రియలు

by  |
sande-gangaiah 1
X

దిశ, పెద్దపల్లి : విశాఖ మన్యంలోని కొయ్యూరు ఎన్ కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు నేత సందే గంగయ్య అంతక్రియలు ఆయన స్వగ్రామంలో శనివారం ముగిశాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపులలో నిర్వహించిన దహన సంస్కారాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. గంగయ్య మృతదేహం శనివారం ఉదయం 9 గంటలకు గ్రామానికి చేరుకోగానే 21 ఏళ్ల క్రితం వెల్లి విగతజీవిగా ఇంటికి రావడంతో తట్టుకోలేకపోయిన తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది.

గుంపుల గ్రామస్థులు కూడా గంగయ్య మృతదేహానికి నివాళులు అర్పించి విలపించారు. ప్రజా సంఘాల నాయకులు గంగన్న అమర్ రహే… అంటూ నినాదాలు చేశారు. గంగన్న ఇంటి నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర గ్రామ వీధుల గుండా పొలం వద్ద వరకూ సాగింది. గంగయ్య ఎదురు కాల్పుల్లో హతం కాలేదని, బూటకపు ఎన్ కౌంటర్ అంటూ అమరవీరుల బంధుమిత్రుల సంఘం నేతలు, గంగన్న సోదరుడు మహేందర్ ఆరోపించారు. గుంపుల గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

సందే రామస్వామి అమృతమ్మ దంపతులకు నలుగురు కుమారులు 1995లో రామస్వామి అనారోగ్యంతో మృతి చెందగా పెద్ద కుమారుడైన రాజయ్య అలియాస్ నరేష్ అప్పటి పీపుల్స్ వార్ దళ సభ్యునిగా పని చేస్తుండగా 1996లో ఓదెల ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్‌లో మృతి చెందాడు. రెండో కుమారుడు ప్రభాకర్ ప్రస్తుతం భూపాలపల్లి సింగరేణి ఉద్యోగం చేస్తున్నాడు. మూడో కుమారుడు గంగయ్య విప్లవోద్యమం వైపు వెల్లగా చివరి వాడు మహేందర్ ప్రస్తుతం గుంపుల గ్రామంలో తల్లి అమృతమ్మను చూసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు కుటుంబ సభ్యులు ఎన్కౌంటర్ కావడంతో సందె కుటుంబం విషాదంలో కూరుకుపోయింది.

Next Story

Most Viewed