ఎంటర్ ది డ్రాగన్.. తెలంగాణాలోకి మావో యాక్షన్ టీం…

by  |
Movoist
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : టార్గెట్లే లక్ష్యంగా మావోయిస్టు పార్టీ యాక్షన్ టీం తెలంగాణ సరిహద్దుల్లోకి ప్రవేశించింది. ఐదుగురు సభ్యులున్న ఈ టీం ఇటీవల గోదావరి నది దాటి భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోకి వచ్చి షెల్టర్ తీసుకున్నట్టుగా గుర్తించిన పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇంతకాలం అడపాదడపా వచ్చిపోయిన మావోయిస్టులు ఇప్పుడు ఏకంగా యాక్షన్ టీంనే రంగంలోకి దింపడంతో పోలీసు యంత్రాంగం హై అలర్ట్ అయింది. ఛత్తీస్ ఘడ్ లోని దండకారణ్య ప్రాంతానికి చెందిన వారే ఈ టీంలో సభ్యులుగా ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. వీరు రాష్ట్రంలోకి ఎందుకు వచ్చారు, వారి లక్ష్యం ఏంటీ అన్న విషయాలు తెలుసుకునే పనిలో నిఘా వర్గాలు నిమగ్నం అయ్యాయి. ఈ కారణంగానే పోలీసులు సరిహద్దు ప్రాంతాలను జల్లెడ పడుతున్నారని తెలుస్తోంది. గ్రామగ్రామాన కార్డన్ సెర్చ్ లు నిర్వహిస్తున్న పోలీసులు అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు. దీంతో సరిహద్దు పల్లెల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

రెక్కి కోసమా.. టార్గెట్ కోసమా..?

Police

మావో యాక్షన్ టీం రాష్ట్రంలోకి రావడానికి కారణం ఏంటీ అన్న విషయం అంతుచిక్కకుండా తయారైంది. యాక్షన్ చేసేందుకు రెక్కి నిర్వహించేందుకు వచ్చారా లేక టార్టెట్ కంప్లీట్ చేసుకునేందుకు వచ్చారా అన్న విషయం తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గతంలోనే సరిహద్దు ప్రాంతాల్లో కొంతమందిని లక్ష్యం చేసుకుని మావోయిస్టులు దాడులు చేసేందుకు స్కెచ్ వేసినా ప్రాక్టికల్ గా సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు కూడా అదే టార్గెట్లను లక్ష్యం చేసుకుని వచ్చారా లేక కొత్తవారి కోసమా అనేది తేలాల్సి ఉంది. ఇంతకాలం ఎలాంటి ఘటనలకు తావివ్వకుండా ఉన్న పోలీసులు ఇప్పుడు కూడా అప్రమత్తం అయ్యారు. యాక్షన్ టీం కార్యకలాపాలను ఆదిలోనే కట్టడి చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. భూపాలపల్లి జిల్లాలలోని మహదేవపూర్, పల్మెల, మహాముత్తారం మండలాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు యాక్షన్ టీం డెన్ ల కోసం వేటాడుతున్నారు. మావోయిస్టులకు ఆశ్రయం కల్పిస్తున్న వారి గురించి ఆరా తీస్తున్నారు.



Next Story

Most Viewed