బిగ్ బ్రేకింగ్ : మంథని టీఆర్ఎస్ నాయకుల కీలక నిర్ణయం

by  |
mantani trs leaders
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : అక్కడ అధికార పార్టీ నాయకులే సర్కార్ పై సమరం మోగించేందుకు రంగం సిద్ధం చేశారు. మా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయలేకపోతున్నామని, వారి అవసరాలను తీర్చలేకపోతున్నామని ఆవేదనతో ఉన్న గులాబీ నేతలంతా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ఆ ప్రాంతంలోని పంటలకు సరిపడా నీల్లిచ్చేందుకు ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయాలన్న కోర్కెను తీర్చలేకపోతున్నామన్న మనోవేదనకు గురైన వారంతా కూడా పోరుబాట పట్టేందుకు సమాయత్తం అయ్యారు. ఆదివారం మంథని మండలం గుంజపడుగు రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

లిఫ్ట్ కోసం ఉద్యమం..

మంథని మండలం పోతారం నుండి కన్నాల వరకు ఎత్తిపోసి అక్కడి నుండి దిగువనున్న 10 వేల ఎకరాలకు పైగా భూములకు సాగు నీటిని అందించాలన్న ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉండటంతో తాము రైతులకు సమాధానం చెప్పలేకపోతున్నామని సమావేశంలో చర్చించారు. ఈ ఎత్తిపోతల వల్ల మంథనికి ఎగువన ఉన్న భూములన్నీ కూడా సస్యశామలం అయ్యే అవకాశాలు ఉన్నాయని భావించి ప్రపోజల్స్ పంపించి రెండేళ్లు కావొస్తున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోతారం నుండి కన్నాలకు నీటిని ఎత్తిపోసి అక్కడి నుండి ఎస్సారెస్పీ డీ83, ఎల్ 6 కెనాల్స్ ద్వారా పంట భూములకు నీరందించాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటివరకూ స్పందన లేకపోవడంపై సమావేశంలో పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకంలో కేవలం పోతారం నుండి కన్నాల వరకు నీటిని ఎత్తిపోసేందుకు మాత్రమే ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని, గతంలో నిర్మించిన ఎస్సారెస్పీ కెనాల్స్ ద్వారా కన్నాల నుండి నీటిని దిగువకు వదిలితే సరిపోతుంది. కన్నాల, రచ్చపల్లిల సమీపంలో నీటిని నిలువ చేసేందుకు చిన్న రిజర్వాయర్‌లా నిర్మాణం జరిపితే సరిపోతుందని స్థానిక నాయకులు అంటున్నారు. అయితే, ఈ ప్రతిపాదన గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తాము ఉద్యమం వైపు సాగక తప్పని పరిస్థితే తయారైందని నాయకులు చర్చించుకున్నారు.

సెప్టెంబర్ 1న పాదయాత్ర..

పోతారం లిఫ్ట్ స్కీంకు అవసరమైన నిధులు మంజూరు చేస్తూ వెంటనే పనులు చేపట్టాలన్న డిమాండ్‌తో వెయ్యి మంది రైతులతో పాదయాత్ర చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. సెప్టెంబర్ 1న మంథని నుండి పెద్దపల్లి వరకు ఈ పాదయాత్ర జరపనున్నారు. అప్పటికీ ప్రభుత్వం లిఫ్ట్ పనులను ప్రారంభించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు కూడా కార్యచరణ రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. పంటలకు నీరందడం లేదంటూ రైతులు గ్రామాల్లో నిలదీస్తుంటే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నందున తామీ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని సమావేశంలో ఓ నాయకుడు మాట్లాడారు. దీంతో మంథని ఎగువ ప్రాంతానికి చెందిన నాయకులు పోరుబాట వైపు సాగే విషయంలో వెనకడుగు వేసే అవకాశాలు కనిపించడం లేదు. ఏది ఏమైనా అధికార పార్టీ నాయకులే తమ ప్రాంత రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఆందోళణ చేపట్టాలని నిర్ణయించడం కలకలం సృష్టిస్తోంది.

Next Story

Most Viewed