ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మాణిక్కం ఠాగూర్ సీరియస్

by  |
Manikkam-Tagore,-MP-Komatir
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టీపీసీసీ పదవిపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ సీరియస్ అయ్యారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. అంతేగాకుండా.. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎన్నో పదవులు వచ్చాయని, అప్పుడు కూడా డబ్బులు ఇచ్చి పదవులు తెచ్చుకున్నారా? అని మండిపడ్డారు. కోమటిరెడ్డి వెంకట్ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని వెల్లడించారు. కోమటిరెడ్డే స్వయంగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే అధిష్టానం చర్యలు తీసుకుంటుందని మహేశ్ గౌడ్ హెచ్చరించారు.

కాగా, ఇంతకాలం పార్టీని నమ్ముకున్న తనకు టీపీసీసీ ఇస్తారని అనుకున్నానని, కానీ ఓటుకు నోటు లాగా పీసీసీ పదవిని అమ్ముకున్నారంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌‌చార్జ్ మాణిక్యం ఠాగూర్ డబ్బులు తీసుకొని పీసీసీ పదవిని కట్టబెట్టారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను త్వరలోనే బయటపెడతానని అన్నారు. టీ-కాంగ్రెస్.. టీ-టీడీపీ లాగా మారవద్దని ఆకాంక్షిస్తున్నానని కామెంట్స్ చేశారు. కాగా, సీనియర్ నేతలందరినీ కలుస్తానంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. తనను కలవడానికి ఎవరూ రావొద్దని స్పష్టమైన ప్రకటన చేశారు. 2023 వరకు నల్గొండ, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గలు చూసుకుంటానని స్పష్టం చేశారు. అంతేగాకుండా.. ఇకపై తాను గాంధీ భవన్ మెట్లు ఎక్కే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తన రాజకీయ భవిష్యత్‌ను కార్యకర్తలే నిర్ణయిస్తారని అన్నారు.

Next Story