వీల్లేదు.. పరీక్షలు నిర్వహించాల్సిందే

by  |
వీల్లేదు.. పరీక్షలు నిర్వహించాల్సిందే
X

న్యూఢిల్లీ: ఫైనల్ ఇయర్ పరీక్షలు రద్దు చేయడం కుదరదని, ఎగ్జామ్స్ నిర్వహించే విద్యార్థులను ప్రమోట్ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సెప్టెంబర్ చివరికల్లా పరీక్షలు నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) విడుదల చేసిన మార్గదర్శకాలను సమర్థించింది. కరోనా కారణంగా సెప్టెంబర్ 30లోపు పరీక్షలు నిర్వహించలేమని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ భావిస్తే వాయిదా వేసుకోవచ్చునని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యార్థులు యూజీసీని ఆశ్రయించవచ్చునని వివరించింది. పరీక్షల రద్దు చేయడం కుదరదని, ముందూ వెనకైనా విద్యార్థులు ఈ ఏడాది కచ్చితంగా పరీక్షలు రాయాల్సిందేనని, ఫలితాల ఆధారంగానే ప్రమోషన్ ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసినట్టయింది.

కొవిడ్ 19 కారణంగా పరీక్షలు రద్దు చేయాలని మహారాష్ట్ర మంత్రి ఆదిత్యా ఠాక్రే నేతృత్వంలో యువసేన సహా పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇంటర్నల్ అసెస్‌మెంట్స్ ఆధారంగా ప్రమోట్ చేయాలని లేదా డిగ్రీలు అందజేయాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్లను జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు ఆర్ సుభాష్ రెడ్డి, ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వీడియో కాన్ఫరెన్సింగ్‌లో విచారించింది. విద్యార్థులను ప్రమోట్ చేయడానికి అంతర్గత సమీక్ష సరిపోదని వ్యాఖ్యానించింది. రాష్ట్రాలు, యూనివర్సిటీలు సెప్టెంబర్ 30లోపు ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించాలని యూజీసీ జులై 6న మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ మార్గదర్శకాలు ఏకపక్ష ఆదేశాలు కావని, కానీ, పరీక్షలు నిర్వహించకుండా రాష్ట్రాలు డిగ్రీలను అందజేయరాదని యూజీసీ కోర్టులో వాదించింది. ఈ డెడ్‌లైన్ పొడిగించడానికి రాష్ట్రాలకు అవకాశముందని తెలిపింది. యూజీసీ వాదనలతో ధర్మాసనం అంగీకరించింది.

Next Story

Most Viewed