ప్రభుత్వం వద్దన్నా.. తెలంగాణలో పెరిగిన మొక్కజొన్న సాగు

by  |
ప్రభుత్వం వద్దన్నా.. తెలంగాణలో పెరిగిన మొక్కజొన్న సాగు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మొక్కజొన్న కొనుగోలు చేయమని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ కొందరు రైతులు అదే పంటను పండిస్తున్నారు. గతేడాది జూలై చివరి నాటికి 1.49లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట వేసిన రైతులు.. ఈ ఏడాది 5.1లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు రావడం, ప్రైవేటు మార్కెట్‌లో పంటలకు డిమాండ్‌ ఉండడంతో మొక్కజొన్న సాగు చేపట్టారు. ఇది ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రకాల పంటల సాగు పెరిగింది. ఇప్పటి వరకు 82.49లక్షల ఎకరాల్లో రైతులు వ్యవసాయం మొదలుపెట్టారు.

ప్రభుత్వం వద్దన్నా..

మొక్కజొన్నకు దేశంలో డిమాండ్ తగ్గిందని, పంటలను కొనుగోలు చేయడం వలన నష్టాలు వస్తున్నాయని ఇక పై మొక్కజొన్నను కొనుగోలు కుదరదని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. ఈ పంటకు బదులు పత్తి, ఇతర చిరుధాన్యాలు సాగు చేసుకోవచ్చని సూచించింది. గత రెండేళ్లుగా ప్రభుత్వం ఈ మేరకు ప్రకటనలు చేస్తున్నప్పటికీ.. రైతులు మాత్రం మొక్కజొన్న పంటను వదలడం లేదు. ప్రతి ఏటా సాగును పెంచుతూ పోతున్నారు. కరోనా సమయంలో అన్ని పంటలను కొనుగోలు చేసిన ప్రభుత్వం మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు నిరాకరించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టడంతో వెనక్కి తగ్గి కొనుగోలు చేపట్టిన ప్రభుత్వం.. ఇక మీదట మొక్కజొన్న కొనుగోలు ఉండదని తేల్చి చెప్పింది.

మొక్కజొన్నలో తక్కువ ఖర్చు ఎక్కువ లాభాలు..

మొక్కజొన్న పంటలను ఎక్కువగా నల్లరేగడి నేలలో సాగు చేస్తారు. ఈ పంటలకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వస్తుండటంతో కొంత మంది రైతులు ప్రతి ఏటా మొక్కజొన్ననే సాగు చేస్తున్నారు. విత్తనాలు నాటడం నుంచి పంటను కోసే వరకు కూలీలతో అవసరం లేకుండా సులువుగా పనులు పూర్తవుతాయి. అధిక శ్రమ లేకుండా పంట చేతికి అందుతుంది. నీటి సౌకర్యానికి శాస్త్రీయ పద్ధతి తోడయితే ఎకరానికి 30 నుంచి 35 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తున్నాయి. ఎకరాకు రూ.5 నుంచి 8వేల ఖర్చుతో రూ.35 నుంచి 40వేల వరకు లాభాలు చేకూరుతున్నాయి. అంతేకాదు, ఈ పంటలను వేసిన తరువాత మినుములు, ఉలవలు వంటి చిరుధాన్యాల సాగుకు అవకాశం ఉంది.

ఈ ఏడాది 5.1లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు..

ప్రతి ఏటా మొక్కజొన్న సాగు పెరుగుతున్నది. గతేడాది జూలై చివరి నాటికి 1.49లక్షల ఎకరాల్లో సాగు చేసిన రైతులు.. ఈ ఏడాది 5.1లక్షల ఎకరాల్లో పంటను సాగు చేపట్టారు. ప్రభుత్వం మొక్కజొన్నను కొనుగోలు చేయనప్పటికీ.. ప్రైవేటు డీలర్లు, పౌల్ట్రీ ఇండస్ట్రీలు కొనుగోలు చేస్తుండటంతో సాగు చేపడుతున్నారు. మద్ధతు ధర అత్యధికంగా రూ.1900 వరకు మార్కెట్‌లో లభిస్తుండటంతో రైతులు లాభాలు పొందుతున్నారు. ఈ ధీమాతోనే రైతులు మొక్కజొన్నలను వేసేందుకు మొగ్గుచూపుతున్నారని వ్యవసాయ గణంకాలు చెబుతున్నారు.


Next Story

Most Viewed