రాజీనామాలపై నిర్ణయమెప్పుడు? : సుప్రీం

by  |
రాజీనామాలపై నిర్ణయమెప్పుడు? : సుప్రీం
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ సర్కారు విశ్వాస పరీక్ష వ్యవహారంపై సుప్రీంకోర్టు బుధవారం వాదనలు విన్నది. 16 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తులు జస్టిస్ డివై చంద్రచూడ్, హేమంత్ గుప్తాల ధర్మాసనం ఆదేశించింది. నిర్ణయమెప్పుడు తీసుకుంటారని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా మధ్యప్రదేశ్ స్పీకర్ ఎన్‌పీ ప్రజాపతి తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. స్పీకర్ అభిప్రాయాన్ని తీసుకోవాల్సి ఉందని, దీనిపై రేపు ఉదయం స్పందిస్తానని చెప్పారు. రెబల్ ఎమ్మెల్యేలు, మధ్యప్రదేశ్ కాంగ్రెస్, బీజేపీ, కమల్‌నాథ్, స్పీకర్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను రేపు(గురువారం) ఉదయానికి వాయిదా వేసింది.

రెబల్ ఎమ్మెల్యేలు మళ్లీ ఎన్నికల్లో పాల్గొనాలని, అటు తర్వాతే విశ్వాస పరీక్ష నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ధనం, అధికారంతో బీజేపీ.. ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేస్తున్నదని కాంగ్రెస్ తరఫు న్యాయవాది దుశ్యంత్ దవే ఆరోపించారు. ఈ విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని కోరారు.

ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని స్పీకర్‌ను గవర్నర్ ఆదేశించడం రాజ్యాంగ విరుద్ధం. అసెంబ్లీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకోరాదని స్పీకర్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. ఇప్పుడు గవర్నర్ ఆదేశాలనే సుప్రీంకోర్టూ సమర్థించాలని వారు యోచిస్తున్నారు గానీ, అలాగైతే స్పీకర్ ఆదేశాలకు విలువలేదా? ప్రశ్నించారు. సుప్రీంకోర్టుతోనే రాజ్యాంగవిరుద్ధ నిర్ణయానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

రెబల్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎందుకు కలవాలనుకుంటోంది. వారిని ప్రలోభపెట్టడానికే కదా.. అంటూ బీజేపీ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి ఆరోపించారు. వాళ్లకు ఇష్టమే లేనప్పుడు కాంగ్రెస్ ఎందుకు కలవాలనుకుంటోంది? ఆ ఎమ్మెల్యేలతో బేరసారాలేడుందుకే కాంగ్రెస్ ఈ ప్రయత్నాలు చేస్తున్నదని వాదించారు.

ప్రభుత్వానికి మెజార్టీ లేదు కాబట్టి వెంటనే ఫ్లోర్ టెస్ట్‌లో పాల్గొనాలని రెబల్ ఎమ్మెల్యేల న్యాయవాది మనిందర్ సింగ్ అన్నారు. ఆరుగురు మంత్రల రాజీనామాలను ఆమోదించిన స్పీకర్ మిగితా 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను ఎందుకు స్వీకరించలేదని ప్రశ్నించారు. కోర్టు కావాలనుకుంటే రెబల్ ఎమ్మెల్యేలను న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు సిద్ధమేనని అన్నారు. దీనికి కోర్టు అభ్యంతరం తెలిపింది. ‘ఆ 16 మంది ఎమ్మెల్యేలు బెంగళూరులో ఉన్నారు. వారిని కోర్టులో హాజరుకావాలని ఆదేశించడం లేదు. కానీ, వారు సొంతంగా, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే వాతావరణాన్ని కల్పించడం కోర్టు బాధ్యత’ అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. వారి రాజీనామాలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ తరఫు న్యాయవాదికి సూచించారు. తమ ఆదేశాలన్నీ ఎమ్మెల్యేల బేరసారాలు జరగరాదనే ఉద్దేశంతో జారీ చేసినవేనని అన్నారు.

tags : madhya pradesh, floor test, supreme court, justice dy chandrachud, kamal nath, govt



Next Story