అధికారులకు షాకిచ్చిన లారీ డ్రైవర్..

by  |
Lorry driver shocked
X

దిశ, భువనగిరి రూరల్ : అధికారులు, మిల్లు ఓనర్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఓ లారీ డ్రైవర్ వినూత్న నిరసనకు దిగాడు. ధాన్యం లోడుతో ఉన్న లారీని తహసీల్దార్ కార్యాలయం గేటుకు అడ్డంగా నిలిపి ఆందోళనకు దిగాడు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. లారీ డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం..

వలిగొండ ఐకేపీ కేంద్రంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని భూదాన్ పోచంపల్లి మండలంలోని పెద్దరావులపల్లి రైస్ మిల్లులో అన్‌లోడ్ చేసేందుకు అధికారులు ఓ లారీని కిరాయికి మాట్లాడి లోడ్‌ను పంపించారు. అయితే వెంటనే ధాన్యాన్ని అన్ లోడ్ చేసుకోవాల్సిన మిల్లు యజమాన్యం 12 రోజులు లారీని వెయిటింగ్‌లో పెట్టి.. ధాన్యం బాగలేదని తిప్పి పంపారు. దీంతో ధాన్యాన్ని ఏం చేయాలి..? తనకు కిరాయి ఎవరో ఇస్తారో తెలియక లారీ డ్రైవర్ ఆందోళన చెందాడు.

దిక్కుతోచని స్థితిలో ఉన్న లారీ డ్రైవర్ ధాన్యం లోడుతో సహా లారీని వలిగొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట గేటుకు అడ్డంగా నిలిపి ఆందోళన చేశాడు. తనకు 12 రోజులు కిరాయి ఇవ్వాలని, ధాన్యాన్ని అన్ లోడ్ చేసుకోవాలని డిమాండ్ చేశాడు. ఆయన ఆందోళనకు లారీ ఓనర్స్ అసోసియేషన్ మద్దతు తెలిపింది. స్పందించిన తహసీల్దార్ వెంటనే ధాన్యాన్ని మరో మిల్లులో అన్ లోడ్ చేపిస్తానని, అద్దె డబ్బులు కూడా వెంటనే చెల్లించే ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనను విరమించారు.

లారీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ధాన్యం రవాణా చేసే విషయంలో అధికారులు లారీ యజమానుల ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. 2014లో నిర్ణయించిన ధరలనే ఇప్పటికీ అమలు చేస్తుండడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా లారీ యజమానులకు అద్దెలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో లారీ అసోసియేషన్ అధ్యక్షుడు రావుల చంద్రమౌళి, పబ్బు వెంకటేష్, కరీం తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed