నిరాడంబరంగా రామయ్య ప‌ట్టాభిషేకం

by  |
నిరాడంబరంగా రామయ్య ప‌ట్టాభిషేకం
X

దిశ‌, ఖ‌మ్మం: భ‌ద్రాద్రి శ్రీరాముడి ప‌ట్టాభిషేకం శుక్ర‌వారం నిరాడంబ‌రంగా సాగింది. కేవ‌లం ఆల‌య సిబ్బంది, అతికొద్దిమంది భ‌క్తుల మ‌ధ్యే ఈ వేడుక ముగిసింది. ఈ వేడుక‌కు ప్ర‌భుత్వం త‌రఫున దేవదాయ‌శాఖ క‌మిష‌న‌ర్ అనిల్‌కుమార్‌, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ర‌మ‌ణాచారి హాజరయ్యారు. ఎమ్మెల్సీ బాల‌సాని స్వామివారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. ఉద‌యం స్వామి వారికి ఆరాధ‌న నివేద‌న అనంత‌రం ప‌ట్టాభిషేక మ‌హోత్స‌వాన్ని ప్రారంభించారు. వేద పండితుల స‌మ‌క్షంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. నిత్య క‌ల్యాణ‌మండ‌పంలోనే ప‌ట్టాభిషేక మ‌హోత్స‌వాన్ని నిర్వ‌హించారు. న‌గ‌లు, రాజ‌దండం, రాజ‌ముద్రిక చ‌త్రం, శంఖ చ‌క్రాలు, కిరీటంతో రాముడిని అలంక‌రించి ప‌ట్టాభిషేక మ‌హోత్స‌వానికి ప‌ల్ల‌కిపై నిత్య క‌ల్యాణ‌మండ‌పానికి చేర్చారు. ఉద‌యం 10:30గంట‌ల‌కు మొద‌లైన ప‌ట్టాభిషేకం మ‌హోత్స‌వం ఒంటి గంట వ‌ర‌కు సాగింది. ఆ త‌ర్వాత ప్ర‌త్యేక పూజలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా శ్రీరామ నామ‌స్మ‌ర‌ణ‌తో ఆల‌య ప్రాంగ‌ణం మార్మోగింది. రాజ్య పాల‌న‌లో రాముడిని మించిన వారు లేరని వేద పండితులు కొనియాడారు.

Tags: lord shri ram, coronation ceremony, bhadradri, corona, virus, mlc balasani



Next Story