రిటైరైన పిల్లి.. సెండాఫ్ ఇచ్చిన స్టాఫ్

by  |
రిటైరైన పిల్లి.. సెండాఫ్ ఇచ్చిన స్టాఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగం చేసే వాళ్లు ఏదో ఒకరోజు రిటైర్ కాకతప్పదు. ఇక ఉద్యోగ విరమణ రోజున సదరు ఉద్యోగికి ఆఫీసు సహోద్యోగులు, స్టాఫ్, యాజమాన్యం అందరూ కలిసి సన్మానం చేసి.. సంతోషంగా ఇంటికి సాగనంపడం కామన్‌గా జరిగే విషయమే. మరి ఈ సెండాఫ్ తతంగం కాస్తా ఓ పిల్లికి జరిగితే? పిల్లి ఉద్యోగం నుంచి రిటైర్ అయితే? ఆశ్చర్యంగా ఉంది కదా ! పిల్లి ఉద్యోగ విరమణ చేయాలంటే.. ముందు దానికి ఓ జాబ్ ఉండాలి కదా! అసలు ఆ పిల్లి ఏం ఉద్యోగం చేసేది? ఒకవేళ చేసినా.. అది రిటైర్‌ అవ్వడం ఏంటి? ఇలా చాలా సందేహాలు వస్తున్నాయి కదా!

పులి.. ఆహారం కోసం జింకను లేదా ఇతర జంతువులను వేటాడుతుంది. పిల్లి కూడా అంతే.. కానీ ఇది ఎలుకల్ని వేటాడుతుంది. సో పిల్లికి కూడా ఓ ప్రొఫెషనాలిటీ ఉంది. అదేనండి.. ఎలుకల్ని పట్టుకోవడం. ఇంకేం పిల్లి ఉద్యోగానికి అదే అర్హత. బ్రిటన్‌ రాజధాని లండన్‌లోని ఫారెన్ అండ్ కామన్‌వెల్త్ ఆఫీస్(ఎఫ్‌సీఓ)లో విపరీతమైన ఎలుకలు ఉండేవి. వాటిని పట్టుకోవడం ఆ ఉద్యోగుల వల్ల కాలేదు. దాంతో.. ఏప్రిల్ 2016లో పామర్‌స్టన్ అనే పిల్లిని బాటర్సీ (లండన్‌లోని పిల్లి, శునకాల ఆశ్రమం) నుంచి ఆఫీసుకు తీసుకొచ్చారు. నాలుగేళ్లుగా అది ఎలుకల్ని పట్టడంలో అవిశ్రాంత సేవలందించింది. ఇక దాని సేవలు చాలని ఎఫ్‌సీఓ అధికారులు ఓ నిర్ణయానికొచ్చారు. దాంతో ఆ పిల్లికి తాజాగా రిటైర్‌మెంట్ ఇచ్చారు.

నాలుగేళ్లుగా ఆఫీసులో అందరిమధ్య తిరుగుతూ తన వృత్తిని సక్రమంగా నిర్వర్తించిన పామర్స్‌కు.. ఎఫ్‌సీవో స్టాఫ్ గ్రాండ్‌గా సెండాఫ్ పార్టీ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆ ఆఫీసు ఉద్యోగులు ట్విట్టర్‌లో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఇంకో విషయమేంటంటే.. ఆ పిల్లికి ట్విట్ట‌ర్‌లో ఫుల్ ఫాలోయింగ్ ఉండటం విశేషం. సోషల్ మీడియాలో పామర్‌స్టన్ ఖాతాకు లక్షకుపైగా ఫాలోవర్లు ఉన్నారు.

Next Story

Most Viewed